ఇరుసుమండ(అంబాజీపేట), న్యూస్‌లైన్ :
మండలంలోని ఇరుసుమండ ప్రధాన రహదారిపై బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యార్ధి మృత్యువాత పడ్డాడు. కూత వేటు దూరంలో తన ఇంటికి చేరడతాడనుకున్న విద్యార్ధి అనంతలోకాలకు వెళ్ళిపోవడంతో తల్లి, బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పుల్లేటికుర్రు పంచాయతీ పరిధిలోని బాబానగర్‌కు చెందిన తొమ్మిదవ తరగతి చదువుచున్న నక్కా గిరేంద్ర (14), అతని స్నేహితుడు ఆరవ తరగతి చదువుచున్న పేరూరి ఆదివిష్ణుమూర్తిలు కలసి సైకిల్‌పై అయినవిల్లి సిద్ధివినాయక ఆలయంలో పెన్నుల పూజకు హజరయ్యారు. అక్కడ పూజ ఆలస్యం అవుతుందని, వారు చదువుతున్న పుల్లేటికుర్రు జెడ్పీ హైస్కూలుకు వెళ్ళేందుకు టైం సరిపోదని తిరిగి ఇంటికి వస్తున్నారు. ఇరుసుమండ వచ్చే సరికి అమలాపురం నుండి ముక్కామల వెళుతున్న లారీ ఎదురుగా సైకిల్‌పై వస్తున్న గిరేంద్ర, ఆదివిష్ణుమూర్తిలను బలంగా ఢీకొట్టింది. దీంతో గిరేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు.
ఆదివిష్ణుమూర్తికి తీవ్ర గాయాలు కావడంతో 108లో అమలాపురం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు అంబాజీపేట ఎస్సై డి.విజయకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి తల్లి నక్కా మంగ, సోదరుడు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరు అయ్యింది. ఉదయం లేచి తనతో సరదగా గడిపాడని గంట వ్యవధిలోనే అందనంత దూరంగా వెళ్ళిపోయాడని రోధిస్తున్న తీరు పలువురిని కంట తడిపెట్టించింది. నేను ఉన్నత చదువులు చదివి బాగా చూసుకుంటాను అని చెప్పి ఓదార్చేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. అందరితో సరదాగా ఉండేవాడిని, మంచివాడని అతని స్నేహితులు, ఉపాధ్యాయులు కన్నీమున్నీరయ్యారు. ఇదిలా ఉండగా మృతిని కుటుంబానికి, గాయపడిన వారికి నష్టపరిహారం ఇచ్చి న్యాయం చేయాలంటూ సంఘటనా స్థలం వద్దే బంధువులు, స్థానికులు, నాయకులు ధర్నా నిర్వహించారు. లారీ యజమాని, రోడ్డు నిర్మాణం చేపడుతున్న కాంట్రాక్టర్ వచ్చి సమాధానం చెప్పేవరకూ ధర్నా విరమించేది లేదని మాజీ సర్పంచ్‌లు నూకపెయ్యి చిన్న, అందె వెంకటముక్తేశ్వరరావు, నీతిపూడి వెంకటరమణ, ముత్తాబత్తుల సోమశేఖర్, వడలి కృష్ణమూర్తి, కత్తుల బాలరాజు, కొల్లి సూర్యారావులు భీషించి రహదారిపై బైటాయించారు. ఎస్సై డి.విజయకుమార్ ఆందోళన కారులతో చర్చించారు. ఇరువురికి న్యాయం చేస్తానని లారీ నిర్వాహకుడు చెప్పడంతో ఆందోళన విరమించారు. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, దాసరి వీరవెంకట సత్యనారాయణ తదితరులు ఆందోళన కారులకు మద్దతు తెలిపి ధర్నాలో పాల్గొన్నారు.
విద్యార్థిని బలిగొన్న రోడ్డు ప్రమాదం
Published Thu, Feb 20 2014 1:43 AM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM
Advertisement
Advertisement