రెప్పవాలితే మరణం
- ఆయువు తీస్తున్న అలసట
- సైబరాబాద్‌లో జరిగే ప్రమాదాల్లో హైవేల్లోనే అధికం
- అమలు కాని డ్రైవర్ల పని గంటలు
- సకాలంలో చికిత్స అందక పెరుగుతున్న మృతులు
ఒక్క క్షణం... ఒకే ఒక్క క్షణం... ఎన్నో జీవితాలను చీకటిమయం చేస్తోంది. ఎన్నో కుటుంబాల్లో దీపాలను ఆర్పేస్తోంది. రెప్పపాటులో ఎంతోమంది మృత్యువుకు చేరువవుతున్నారు. తమపై ఆధారపడిన వారికి అందకుండా పోతున్నారు. విశ్రాంతి లేకుండా వందల కిలోమీటర్లు...రోజుల తరబడి వాహనాలు నడుపుతున్న డ్రైవర్లు... అలసటతో పొరపాటున రెప్ప వాల్చుతున్నారు. అది తమతో పాటు ఇతరుల ప్రాణాల మీదకు తెస్తోంది. వాహన యజమానులు...సంస్థల కక్కుర్తి సాక్షిగా ఏటా వందలాది ప్రాణాలు గాలిలో కలసిపోతున్నాయి.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోనే అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు నమోదవుతున్న ప్రాంతం నగరం చుట్టూ విస్తరించి ఉన్న సైబరాబాద్ కమిషనరేట్. ఇక్కడ 2013లో 3804 ప్రమాదాలు చోటు చేసుకోగా...వాటిలో 1809 (47.55 శాతం) జాతీయ, రాష్ట్ర రహదారులైన హైవేల్లో నమోదయ్యాయి. మొత్తం ప్రమాదాల్లో 1119 మంది మృత్యువాత పడగా... హైవేల్లో జరిగిన వాటిలోనే 544 (48.61 శాతం) మంది అశువులు బాశారు. ఈ పరిస్థితులకు అతివేగంతో పాటు డ్రైవర్ల అలసట కూడా ప్రధాన కారణమని ట్రాఫిక్ పోలీసుల అధ్యయనంలో తేలింది.
ఎప్పుడూ హడావుడే
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మొత్తం ఐదు జాతీయ, మరో ఐదు రాష్ట్ర రహదారులు ఉన్నాయి. వీటిపై ప్రయాణించే వాహనాల్లో అత్యధికం ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలకు చెందిన, వ్యక్తిగత కమర్షియల్ వాహనాలే. వీరి వ్యవహారం ఎప్పుడూ హడావుడిగానే ఉంటుంది. నిత్యం సుదూర ప్రాంతాల నుంచి గమ్యస్థానాలకు సరకు రవాణా కోసం వినియోగించే వాహనాల డ్రైవర్లకు అవసరమైన విశ్రాంతి ఉండదు. ఎన్ని ట్రిప్పులు వేస్తే అంత ఎక్కువ మొత్తం సంపాదించవచ్చనే ధోరణితో యాజమాన్యాలు పని చేస్తుంటాయి. ఫలితంగా ఎప్పటికప్పుడు డ్రైవర్లను తొందరపెడుతూ అవసరమైన మేరకు విశ్రాంతి కూడా ఇవ్వకుండా పని చేయిస్తుంటాయి. ఈ అలసట వారిపై తీవ్ర ప్రభావం చూపి, ప్రమాదాలకు దారి తీస్తోంది.
అలసట తీరేందుకు ఆగినా...
జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రయాణించే డ్రైవర్లలో కొందరు కాస్త అలసట తీర్చుకుందామని భావించినా ఇబ్బంది ఎదురవుతోంది. వాహనాలను పార్కింగ్ చేసుకుని డ్రైవర్లు సేద తీరేందుకు అవసరమైన స్థలాలు అన్ని చోట్లా అందుబాటులో లేవు. ఫలితంగా ఎక్కువ శాతం దాబాలు, రెస్టారెంట్లు, పెట్రోల్ బంకుల వద్దే వీరు తమ వాహనాలను ఆపి, విశ్రాంతి తీసుకుంటున్నారు. మరికొందరు డ్రైవర్లు గత్యంతరం లేక రహదారిపక్కనే ఆపుతున్నారు. ఇలా అక్రమ పార్కింగ్‌లో ఉన్న వాహనాలను గుర్తించని సందర్భంలో వేగంగా వస్తున్న వాహనాలు వీటిని ఢీకొంటున్నాయి. ఈ కారణంగానూ హైవేలపై ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. జాతీయ రహదారుల్లో అనేక చోట్ల వాహనాలు ఆపుకోవడానికి ప్రత్యేక స్థలాలు కేటాయించినా, అందరూ వీటిని వినియోగించుకోకపోవడమూ ప్రమాదాలకు మరో కారణంగా చెప్పవచ్చు.
వైద్యం అందక పెరుగుతున్న మృతులు
హైవే ప్రమాదాల్లో తక్షణం చనిపోతున్న వారి కంటే వైద్యం అందటంలో (ట్రామా కేర్) ఆలస్యం కావడం మృతుల సంఖ్యను పెంచుతోంది. ఓ ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు తొలి గంటను ‘గోల్డెన్ అవర్’గా పరిగణిస్తారు. కొన్ని సందర్భాల్లో ప్రమాదం జరిగిన విషయాన్ని గుర్తించడానికి స్థానికులు, పోలీసులతో పాటు ఆ రహదారిలో వెళ్తున్న వారికీ కొంత సమయం పడుతోంది. ఆపై విషయం 108కి చేరి, ఆ సిబ్బంది క్షతగాత్రులను సమీపంలో ఉన్న ఆస్పత్రులకు చేరుస్తున్నారు. వీరి సంబంధీకులు వెంట లేకపోవడంతో తక్షణం ఖరీదైన వైద్యాన్ని ప్రారంభించడంలో ఆస్పత్రి యాజమాన్యాలు వెనుకడుగు వేస్తున్నాయి. ఫలితంగా ‘గోల్డెన్ అవర్’ దాటిపోయి క్షతగాత్రులు మరణిస్తున్నారు.
ఎంవీ చట్టం ఏం చెబుతోందంటే...
ప్రతి కమర్షియల్ వాహనంలోనూ కచ్చితం గా డ్రైవర్‌తో పాటుకో-డ్రైవర్ ఉండాల్సిందే.
డ్రైవర్ల రోజుకు కేవలం పది గంటల (విశ్రాంతితో కలిపి) చొప్పున వారానికి 48 గంటలు మాత్రమే పని చేయాలి.
డ్రైవర్ల విధులు నిర్వర్తించే ఎనిమిది గంటల కాలంలో కచ్చితంగా రెండు గంటలు విశ్రాంతి తీసుకోవాలి.
తన వాహనం ద్వారా ప్రమాదానికి కారణమైన వ్యక్తి ఆ సమాచారాన్ని పోలీసులకు తెలిపి తీరాలి.
రహదారుల పక్కన అనధికారికంగా ఎక్కడా వాహనాలకు పార్కింగ్ చేయకూడదు.
ఇవి అమలు కానందునే హైవేలపై ప్రమాదాలు ఎక్కువగా నమోదవుతున్నాయి.
ఇలా చేస్తేనే ఫలితాలు...
కమర్షియల్ వాహనాల డ్రైవర్లకు కచ్చితంగా పని గంటలు అమలు చేయడంపై ఆర్టీఏ విభాగం దృష్టి పెట్టాలి.
రహదారులపై అక్రమ పార్కింగ్‌ను నియంత్రించడంతో పాటు ప్రమాదాలను గుర్తించడానికీ ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహించాలి.
ప్రస్తుతం రహదారి భద్రతకు సంబంధించి కేవలం ‘3-ఈ’గా పిలిచే ఇంజనీరింగ్ (రహదారుల అభివృద్ధి), ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఉల్లంఘనులకు చలానాలు విధించడం), ఎడ్యుకేషన్‌లకే (నిబంధనలపై అవగాహన కల్పించడం) ప్రాధాన్యం ఇస్తున్నారు.
దీనికి తోడు నాలుగో ‘ఈ’గా పరిగణించే ఎమర్జెన్సీ (ప్రమాదాల సమయంలో స్పందించడం) అంశానికీ ప్రాధాన్యం ఇవ్వాలి.
విషయంలో ప్రస్తుతం గుర్గావ్‌లోని జాతీయ రహదారిపై కేంద్రం ‘క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్’ అనే పెలైట్ ప్రాజెక్ట్ చేపట్టింది.
దీని ప్రకారం బాధితులకు ఏ ఆస్పత్రి అయినా తక్షణం రూ.30 వేల వరకు ఖరీదైన చికిత్స చేయవచ్చు. ఆ మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది.
ఇలాంటి విధానాలను సైబరాబాద్, హైదరాబాద్ మీదుగా వెళ్లే హైవేలపై కూడా అమలు చేయాలి.
ప్రమాదం జరిగిన వెంటనే ఎవరైనా తక్ష ణం స్పందించేలా అవగాహన కల్పించాలి. బాధితులను ఆదుకున్న వారికి పోలీసుల నుంచి ఇబ్బందులు లేకుండా చూడాలి.