ప్రాణాలు తీసిన బైక్ ప్రయాణం
Published Sun, Apr 9 2017 12:58 AM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM
బుట్టాయగూడెం : ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనగా ఓ వ్యక్తి దుర్మరణం పాలైన సంఘటన బుట్టాయగూడెం మండలం ముప్పినవారిగూడెంలో శని వారం చోటుచేసుకుంది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం.. తెల్లంవారిగూడెం గ్రామానికి చెందిన కారం చిన్నగంగరాజు (50) బుట్టాయగూడెం నుంచి బైక్‌పై స్వగ్రామం వెళుతుండగా ముప్పినవారిగూడెంకు చెందిన అనిశెట్టి గురువులు, శీలబోయిన సత్యనారాయణ మోటార్ సైకిల్‌పై తెల్లంవారిగూడెం నుంచి ముప్పినవారిగూడెం వ స్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. రెండు వాహనాలు ముప్పినవారిగూడెం ఎస్సీ కాలనీ సమీపంలో ఢీకొన్నాయి. ఈ సమయంలో సత్యనారాయణ చేతిలో ఉన్న గునుపం చిన్నగంగరాజు కుడి భుజంలో గుచ్చుకోవడంతో పాటు కింద పడటంతో తలకు తీవ్రగాయమైంది. స్థానికులు హుటాహుటిన చిన్నగంగరాజును ప్రభుత్వాస్పత్రికి తరలించేలోపు మృతిచెందాడు. మృతుడి కుమారుడు విజ య్‌కాంత్ ఫిర్యాదు మేరకు ఏఎస్సై నరసింహరావు సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. ఇదిలా ఉండగా మృతి సమాచారాన్ని రెవెన్యూ అధికారులకు తెలియజేసినా స్పందించకపోవడంతో రాత్రి 7 గంటల వరకూ పోస్ట్‌మార్టం చేసేందుకు అవకాశం లేకుండా పోయిందని కారం వాసు ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు.
లారీ ఢీకొని వ్యక్తి మృతి
యలమంచిలి : యలమంచిలి మండలం ఇలపకుర్రు పంచాయతీ సంగటిరేవు వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంజేటి దుర్గారావు (38) అనే వ్యక్తి మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంజేటి దుర్గారావు, దాకే సూరిబాబు బైక్‌పై కట్టుపాలెం బయలుదేరారు. సంగటిరేవు వంతెన దాటి పాలకొల్లు రోడ్డు ఎక్కుతుండగా దొడ్డిపట్ల వైపు నుంచి వచ్చిన లారీ ఢీ కొట్టింది. దీంతో ఇద్దరూ కింద పడగా గాయాలయ్యాయి. స్థానికులు వీరిని పాలకొల్లు ఆస్పత్రికి తరలించగా దుర్గారావు మరణించాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు. సూరిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన లారీని సీజ్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
Advertisement
Advertisement