కుమారుడు హితేష్ మృతదేహం వద్ద విలపిస్తున్న తల్లి సుమిత్ర (ఇన్‌సెట్) హితేష్ (ఫైల్)
సాక్షి, పెందుర్తి: పాఠశాల ఆవరణలో ఆడుకుంటున్న విద్యార్థి అకస్మాత్తుగా అపస్మారక స్థితికి వెళ్లిపోయి మృతి చెందిన ఘటన పెందుర్తి సమీపంలోని పాపయ్యరాజుపాలెంలో చోటుచేసుకుంది. ఫిట్స్ కారణంగా విద్యార్థి మరణించినట్లు వైద్యులు నిర్థారించారు. అయితే అనారోగ్యానికి గురైన తమ బిడ్డను ఆసుప్రతికి తరలించడంతో పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వహించిందని ఆరోపించగా... తాము సకాలంలోనే స్పందించి తల్లిదండ్రులకు సమాచారం అందించామని పాఠశాల యాజమన్యం చెబుతుంది. ఈ విషాద ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసి జిల్లాకు చెందిన పంచం సతీష్, సుమిత్ర దంపతులు 2002లో విశాఖ వచ్చి పాపయ్యరాజుపాలెంలో స్థిరపడి అక్కడే టైల్స్ వ్యాపారం చేసుకుంటున్నారు. వీరికి హితేష్(13), శుభం అనే ఇద్దరు కుమారులు. పిల్లలిద్దరూ ఇంటికి సమీపంలో ఉన్న ఆక్స్‌ఫర్డ్ పాఠశాలలో చదువుతున్నారు. ప్రస్తుతం హితేష్ 8వ తరగతికి వచ్చాడు. కాగా సోమవారం ఆటల సమయంలో పాఠశాల ఆవరణలో హితేష్ తోటి పిల్లలతో క్రికెట్ ఆడుతున్నాడు. కాసేపటికే తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలిపోయాడు. విషయాన్ని గమనించిన తోటి విద్యార్థులు పాఠశాల ఉపాధ్యాయులకు చెప్పగా వారు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. బాలుడిని గోపాలపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే హితేష్ మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
రాజుకున్న వివాదం
మరోవైపు హితేష్ మరణంపై వివాదం రాజుకుంది. పాఠశాల యాజమాన్యం సకాలంలో స్పందించి ఉంటే తమ బిడ్డ బతికేవాడని తల్లిదండ్రులు ఆరోపించారు. పాఠశాల వద్దకు విద్యార్థి మృతదేహాన్ని తీసుకొచ్చి ఆందోళన చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పెందుర్తి సీఐ వెంకునాయుడు ఆధ్వర్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. ఈ ఘటనపై పాఠశాల కరస్పాండెంట్ చంద్రశేఖర్‌రెడ్డి స్పందిస్తూ విద్యార్థి మృతికి తమ నిర్లక్ష్యం కారణం కాదని స్పష్టం చేశారు. విషయం తెలిసిన వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment