
ఆ నదులను ప్రాణ జీవులుగా గుర్తించండి
హైకోర్టులో న్యాయ విద్యార్థిని దీప్యా చౌదరి పిల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీల్లో ప్రవహిస్తున్న పెన్నా, కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి నదులను, వాటి ఉప నదులను ప్రాణమున్న, చట్టబద్ధ జీవులుగా గుర్తించాలంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. మనిషికి ఉండే అన్ని చట్టబద్ధమైన హక్కులను వాటికీ కల్పించాలని కోరుతూ న్యాయ విద్యార్థిని దీప్యా చౌదరి పిల్ దాఖలు చేశారు. ఇందులో కేంద్ర నీటి వనరుల శాఖ కార్యదర్శి, తెలంగాణ, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శులు, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ నదులు తమను తాము రక్షించుకోలేవు కాబట్టి వాటిని ప్రాణమున్న, చట్టబద్ధ జీవులుగా గుర్తించాలని కోరుతున్నానని పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఈ నదులను, ఉప నదులను పరిరక్షిం చేందుకు, వాటి సహజ ప్రవాహానికి ఎటువంటి అడ్డంకుల్లేకుండా చూసేందుకు ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు లేదా ఇతర ఏ అధికారులనైనా నియమిం చాలని కోరారు. నదుల్లో చెత్తా చెదారం ఆసుపత్రుల వ్యర్థాలు తదితరాలను వేయకుండా తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని అభ్యర్థించారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో ఎక్కడెక్కడ మురి కినీటి శుద్ధి కేంద్రాల వివరాలను కోర్టు ముందుంచేలా ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలివ్వాలని కోరారు.