రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం
Published Thu, Aug 8 2013 3:14 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
కొండమల్లేపల్లి, న్యూస్‌లైన్ :పాఠశాలకని ఇంటి నుంచి బయలుదేరిన బాలుడిని డీసీఎం రూపంలో మృత్యువు కబళించింది. అప్పటి వరకు ప్రయాణించిన డీసీఎం వాహనమే డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఆ బాలుడి ప్రాణాలు బలితీసుకుంది. ఈ విషాద సంఘటన బుధవారం దేవరకొండ మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకొండ మండలం మైనంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మర్రిచెట్టు తండాకు చెందిన బాలు, చిట్టి దంపతులకు ముగ్గురు సంతానం. చిన్న కుమారుడైన మూడావత్ విజయ్ (14) దేవరకొండ పట్టణంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు.
బుధవారం తండాకు వచ్చిన డీసీఎంలో మరో విద్యార్థి బాబులాల్‌తో కలిసి దేవరకొండ కు బయలుదేరారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలోని సుమోఅడ్డా వద్ద కిందకు దిగుతుండగా విజయ్ పుస్తకాలు కిందపడిపోయాయి. కిందకు వంగి పుస్తకాలను తీసుకుంటున్న సమయంలో డీసీఎం వెనక్కి రావడంతో వెనక చక్రాల కిందపడి తీవ్ర గాయాలపాలయ్యాడు. అక్కడే ఉన్న కొందరు గమనించి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తుండగానే మృతిచెందాడు. డీసీఎం డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే విజయ్ మృతిచెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు దేవరకొండ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎం.నాగేశ్వర్ రావు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
Advertisement