భైంసా, న్యూస్‌లైన్ : బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల నిరసనలు శుక్రవారం ఆరో రోజుకు చేరుకున్నాయి. తమతోపాటే చదివే ఈ-4 విద్యార్థి నాగరాజు భవనంపై నుంచి దూకి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నా సిబ్బంది పట్టించుకోకపోవడంతో విద్యార్థులు ఆందోళనబాట పట్టారు. ఆర్‌జేయూకేటీ ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడి ఇక్కడి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
వివాదాస్పద అధికారులకే ప్రాధాన్యం
కళాశాల ప్రారంభంలో నియమితులైన ట్రిపుల్ ఐటీ అధికారులే వివాదాలకు కేంద్ర బిందువు అవుతున్నారు. ఈ అధికారులను తొలగించాలంటూ కళాశాల విద్యార్థులు ఇప్పటికే ప లు పర్యాయాలు రోడ్డెక్కారు. గతంలో వారిని తొలగిస్తున్నట్లు తెల్లకాగితాలపై రాజీనామాలను తీసుకుని మళ్లీ వారినే కొనసాగించారు. సమస్యలపై గళం విప్పిన విద్యార్థులను ఈ అధికారులు టార్గెట్ చేస్తున్నారు. ఈ అధికారులను పక్కకు తప్పించాల్సిన ఆర్‌జే యూకేటీ ఉన్నతాధికారులు ప్రతిసారి వారికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫిబ్రవరి 23, 24 తేదీల్లో ఆందోళనబాట పట్టిన విద్యార్థులకు హైదరాబాద్ నుంచి రిజిస్టార్ సోమయ్యను పంపి చర్చించారు.
అధికారులను సస్పెండ్ చేస్తున్నట్లు విద్యార్థులకు హామీ ఇచ్చినా ఈ విషయం పై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత రాలేదు. దీంతో ఈసారి కళాశాలలోనే ఆందోళన కొన సాగిస్తున్నారు. ట్రిపుల్ ఐటీపై ఆర్‌జేయూకేటీ వీసీ దృష్టి సారించి ప్రక్షాళన చేస్తేనే దీక్ష విరమిస్తామని విద్యార్థులు తేల్చిచెబుతున్నారు. కాగా.. విద్యార్థులు ఆలస్యంగా వచ్చారని ఇప్పటి వరకు రూ.30 లక్షల మేర కళాశాల సిబ్బంది అపరాధ రుసుం వసూలు చేసిందని, ఆ డబ్బును మృతుడి కుటుంబానికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆరో రోజూ ఆందోళన
Published Sat, Mar 1 2014 2:45 AM | Last Updated on Sat, Sep 2 2017 4:12 AM
Advertisement
Advertisement