బధిర విద్యార్థి ఆత్మహత్య
Published Sun, Jan 26 2014 1:57 AM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM
రాజమండ్రి, న్యూస్‌లైన్ :రాజమండ్రిలో కోరుకొండ రోడ్డులోని ఓ చెవిటి, మూగ పాఠశాలలో ఓ బధిర విద్యార్థి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. తాను ఆత్మహత్య చేసుకునే ముందు మొబైల్ ఫోన్‌లో తల్లిదండ్రులకు, కొందరు స్నేహితులకు మెసేజ్ పంపాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పక్కిలంకకు చెంది న డేరా ముసలయ్య (20) స్థానిక చెవిటి, మూగ పాఠశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. కొద్దిరోజుల క్రితం ఇంటికి వెళ్లి గొడవపడి వచ్చేశాడు. శుక్రవారం రాత్రి తాను చనిపోతున్నట్టు తల్లిదండ్రులకు ఎస్‌ఎంఎస్ చేశాడు. కూలి పనులు చేసుకుని జీవిస్తున్న వారికి చదువు రాని కారణంగా దానిని గుర్తించలేకపోయారు. అదే మెసేజ్.. ‘ఆయామ్ శాడ్, వర్రీ, డఫ్ అండ్ డంబ్, మై డెడ్’ అంటూ ఇద్దరు స్నేహితులకూ ఎస్‌ఎం ఎస్ చేసినట్టు పోలీసులు గుర్తించారు.
అయితే వారు నిద్రలో ఉండడంతో గమనించలేదు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక పాఠశాల ఆవరణలోని షెడ్డులో ఇనుప రాడ్డుకు ముసలయ్య ఉరి వేసుకున్నాడు. కాలకృత్యం కోసం బయటకు వచ్చిన కొందరు విద్యార్థులకు ముసలయ్య ఉరి తాడుకు వేలాడుతూ కనిపించాడు. దీంతో వారు హెచ్‌ఎం మాణిక్యానికి తెలిపారు. ఆమె పోలీసులకు సమాచారం అందించారు. ఉరి వేసుకున్న తాడు కొద్దిరోజుల క్రితం స్కూలు పక్కనే జరిగిన వేడుకల టెంట్‌కు సంబంధించింది. ఆ రోజు ముసలయ్య టెంట్ నిర్వాహకులతో గొడవపడి, ఆ తాడు తనదంటూ తెచ్చుకున్నాడని స్కూలు విద్యార్థులు చెప్పారు. గతంలోను అతడు చేతిని కోసుకున్నాడు. ఏడాది కాలంగా ఇక్కడ పాఠశాలలో ఉంటున్నాడు. ట్రైనీ డీఎస్పీ కె.శ్రీనివాసరావు, సీఐ రమేష్, ఎస్సై లక్ష్మీనారాయణ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Advertisement
Advertisement