విద్యార్థులకు ప్రేమ ప్రతిబంధకమే...
విద్యార్థులకు ప్రేమ ప్రతిబంధకమే...
వాలంటైన్స్‌డేని పురస్కరించుకుని ప్రేమ, ఆకర్షణ, పరస్పర అవగాహన తదితర అంశాలపై నగరంలోని పలు కళాశాలలకు చెందిన 100 మంది విద్యార్థినీ విద్యార్థులను ‘సాక్షి’ ప్రశ్నించింది. వారు తమ అభిప్రాయాలను ఈ విధంగా ఆవిష్కరించారు.
1.వాలెంటైన్స్ డే సంప్రదాయం మంచిదేనా? కాదా?
మంచిదే - 62, కాదు - 38
2.నిజమైన ప్రేమ ఇప్పటికే ఉందంటారా?
ఉంది - 88, ఎక్కడిదండీ - 12
3.విద్యార్థులకు ప్రేమ ప్రతి బంధకం కాదా?
అవును -- 82, కాదు --- 18
4.సినిమాల్లో చూపించే ప్రేమ సరైనదేనా?
అవును -- 80, కాదు -20
5.ఇప్పటిదాకా మీరు ఎవరినైనా ప్రేమించారా?
అవును -- 76, లేదు --- 24
6.మీ ప్రేమను వ్యక్తం చేశారా?
చేశాం -- 66, లేదు -- 34
7.వాలంటైన్స్‌డే జరుపుకుంటున్నారా?
అవును - 78, లేదు-- 22
8.వాలెంటైన్స్ డే రోజున కలుసుకుంటారా?
కచ్చితంగా ....- 90, కష్టమేమో-- 10
9.ప్రేమించే పెళ్లి చేసుకుంటారా, లేక పెద్దలు కుదిర్చిన పెళ్లా?
లవ్ మ్యారేజ్ - 65, పెద్దలు కుదిర్చిన పెళ్లి 35
10. ప్రేమకు కులం, మతం అవసరమా? డబ్బు అవసరమా?
ఇవేమీ అవసరం లేదు - 86, డబ్బు అవసరం - 14
నిర్ణయమే కీలకం..
గుంటూరు నగరంలో ప్రముఖ హృద్రోగ నిపుణులైన డాక్టర్ రాఘవశర్మది ప్రేమ వివాహం. న్యూరాలజీలో పీజీ చేసిన డాక్టర్ విజయను 1986లో అగ్నిసాక్షిగా పెళ్లాడారు. ప్రేమించి పెళ్లి చేసుకునే యువతకు వీరి వైవాహిక జీవితం స్ఫూర్తిదాయకం. వాలెంటైన్స్ డే సందర్భాన్ని పురస్కరించుకుని ‘సాక్షి’ వీరిని పలకరించినపుడు ప్రేమించే యువతకు చక్కని సూచనలు చేశారు. అవి వారి మాటల్లోనే...
మేమిద్దరం ఎంబీబీఎస్ అయ్యాక 1985లో చండీగఢ్‌లో పీజీ చేశాం. అప్పుడే మా ఇద్దరి మధ్యా ప్రేమ మొదలైంది. ఆ బ్యాచ్‌లో ఇద్దరం తెలుగు వాళ్లమే కావడంతో ఒకరి భావాలను మరొకరం అర్థం చేసుకున్నాం. మా ఇద్దరి అభిరుచులు, ఆశయాలూ, ఇష్టాఇష్టాలు ఒకటే అయ్యాయి. పెళ్లి చేసుకోవాలని మేం తీసుకున్న నిర్ణయాన్ని మొదట్లో పెద్దలు అంగీకరించలేదు. అయితే వారిని ఒప్పించాం. పెళ్లి చేసుకున్నాక ఒకరినొకరం అర్థం చేసుకుంటూ వైద్య వృత్తిలో ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నాం. వృత్తితో జీవితం బిజీగా మారినా పిల్లలకు అవసరమైనంత సమయాన్ని కేటాయించేవాళ్లం. వారిని బాగా చదివించాం. ప్రస్తుతం పిల్లలిద్దరూ మెడి సిన్ చదువుతున్నారు. ఇకపోతే....నేటి యువతకు మేం చెప్పే సలహా ఒకటే. ఇష్టపడే వ్యక్తిని మొదట నిశితంగా పరిశీలించండి. సరైన వయస్సు వచ్చాకే ప్రేమ వైపు మరలండి. నచ్చిన వ్యక్తికి దగ్గరయ్యే క్రమంలో తీసుకునే నిర్ణయం ఎంతో కీలకం. ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. వీలైతే పెద్దల సలహా తీసుకుని పెళ్లి చేసుకోవడం మంచిది. వారి నుంచి సహకారం అందకపోతే మీరే సరైన నిర్ణయాన్ని తీసుకుని జీవితాంతం ప్రేమను సమానంగా పంచుకోవాలి.
కడదాకా ప్రేమిస్తూనే ఉండాలి...
జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డెరైక్టర్ సేనాపతి ఢిల్లీరావు, డీఆర్‌డీఏ పీడీ ప్రశాంతిలది కూడా ప్రేమ వివాహమే. వీరిద్దరూ చూడముచ్చటైన జంట. కీలకమైన శాఖలకు అధికారులుగా కొనసాగుతోన్న ఢిల్లీరావు, ప్రశాంతి ఇప్పటికే మూడు జిల్లాల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి ఆయా ప్రాంతాల్లోని ప్రజల ద్వారా ప్రశంసలందుకున్నారు. వాలెంటైన్స్ డే గురించి సాక్షి ప్రస్తావించినపుడు డ్వామా పీడీ ఢిల్లీరావు ఈ విధంగా స్పందించారు.
హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శాఖలో 2007లో గ్రూప్-1 అధికారులుగా శిక్షణ పొందాం. ఆ సమయంలోనే ఒకరినొకరం ఇష్టపడ్డాం. మా ఇద్దరిదీ శ్రీకాకుళం జిల్లానే. పైగా పక్క పక్క ఊళ్లే. మాటలు కలిశాయి. ఆశయాలు, అభిరుచులూ కూడా కలిశాయి. పెద్దలకు చెప్పి 2008లో అన్నవరంలో వివాహం చేసుకున్నాం. విజయనగరం, గుంటూరు, అనంతపురం, జిల్లాల్లో పనిచేసి మళ్లీ గుంటూరుకు వచ్చాం. పెళ్లి చేసుకునే ముందు ఏర్పడ్డ అభిప్రాయం, ప్రేమ జీవితాంతం అలాగే ఉండాలి. భార్యను భర్త, భర్తను భార్య ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉండాలి. ఇద్దరి మధ్యా డామినేషన్స్ పెరగకూడదు. ఒకరికొకరు సర్దుకు పోయే తత్వం పెరగాలి. ఒకరి ఇష్టాలను మరొకరు గౌరవించాలి. భార్యాభర్తల మధ్య ఇవన్నీ సక్రమంగా ఉంటే....వారి వైవాహిక జీవితం ఆనందమయమే.