‘ఎంజాయ్ కోసం పెళ్లి.. పిల్లలు అక్కర్లేదు’ | husband fraud his wife in guntur district | Sakshi
Sakshi News home page

వంచనకే ప్రేమించాడు..

Published Sun, Dec 17 2017 10:55 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

husband fraud his wife in guntur district - Sakshi

సాక్షి, గుంటూరు‌: బాలికను  ప్రేమించి పెళ్లాడి... గర్భవతిగా ఉన్న భార్యను ఎంజాయ్‌ చేయడం కోసం పెళ్లి చేసుకున్నా.. పిల్లలు వద్దంటూ బలవంతంగా టాబ్లెట్లు మింగించి అబార్షన్‌ అయ్యేలా చేశాడు ఓ ప్రబుద్ధుడు. పైగా ఆత్మహత్యాయత్నం  చేసినట్టుగా నటించి భార్యపైనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలిక తల్లి తన కూతురుకు జరిగిన అన్యాయంపై  లాలాపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక తల్లి నూర్జాన్‌బీ తెలిపిన వివరాల ప్రకారం నల్లచెరువు 25వ లైనులో నివసించే నూర్జాన్‌బీ భర్త మృతి చెందడంతో ఒక్కగానొక్క కూతురుతో నివసిస్తోంది. 

కూలి పనులు చేసుకుంటూ తన కుమార్తెకు కుట్టు శిక్షణ ఇప్పించింది. ఈ క్రమంలో గత ఏడాది నల్లచెరువు 21 వలైనుకు చెందిన కోటేశ్వరరావు,కుమారి దంపతుల కుమారుడు సత్య ప్రేమిస్తున్నానని వెంటపడి మైనార్టీ తీరని బాలికను విజయవాడ తీసుకువెళ్లి పెద్దలకు చెప్పకుండా వివాహం చేసుకున్నాడు. అనంతరం అక్కడే రెండు నెలలు కాపురం పెట్టాడు. ఆ తర్వాత నూర్జాన్‌బీ వద్దకు వచ్చి ఆమె ఇంటి సమీపంలోనే కాపురం పెట్టాడు. బాలిక గర్భవతి అవడంతో ఇంటి అద్దె చెల్లించకుండా ఆమెను వదిలి వెళ్లాడు. బాలిక  కల్యాణ మండపాలలో  పని చేసిన కారణంగా అబార్షన్‌ అయింది. 

పిల్లలు అక్కర్లేదు అంటూ..: ఆ తర్వాత  సత్య రాజీ పడి నల్లచెరువు 0/5 లైనులో విడిగా కాపురం పెట్టాడు. అయితే తరచూ భార్యను కొట్టి వేధించేవాడు. నూర్జాన్‌బీ కుమార్తెకు ఇచ్చిన బంగారు నగలు అమ్మేశాడు. 15 రోజుల క్రితం మైనర్‌ బాలిక గర్భిణీ అని తెలియడంతో తాను ఎంజాయ్‌ చేయడానికి వివాహం చేసుకున్నానని, తనకు పిల్లలు అక్కర్లేదు అంటూ సత్య తన భార్య చేత బలవంతంగా టాబ్లెట్లు మింగించాడు. దీంతో బాలికకు అబార్షన్‌ అయింది. విషయం తెలిసిన నూర్జాన్‌బీ అల్లుడిని మందలించి వెళ్లింది.

ఆత్మహత్యాయత్నం చేసినట్టు నటించాడు.. అయితే అత్త తనపై పోలీసులకు ఎక్కడ ఫిర్యాదు చేస్తుందోనని ముందు జాగ్రత్తగా ఈ నెల 11వ తేదీన సత్య తన భార్య చూస్తుండగానే మూడు నిద్ర మాత్రలు నూరి కొద్దిగా పొడిని నోట్లో వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసినట్టు నటించాడు. విషయం తెలుసుకున్న సత్య తల్లిదండ్రులు సత్యకు ఆసుపత్రిలో చికిత్స చేయించారు.  అనంతరం సత్య భార్యపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. నూర్జాన్‌బీ ఆమె కుమార్తె పోలీ స్‌స్టేషన్‌లో తమకు జరిగిన అన్యాయం మొత్తాన్ని ఆధారాలతో నిరూపించడంతో పోలీసులు సత్యపై కేసు నమోదు చేశారు. సత్య పరిచయం అయిన మొదట్లో తల్లిదండ్రుల్ని సమీప బంధువులుగా చెప్పి, తనకు తల్లిదండ్రులు లేరంటూ బాలికను నమ్మించాడని నూర్జాన్‌బీ తనఅల్లుడి మోసపూరిత బుద్ధిని వివరించింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement