ఓ టీడీపీ నేత విద్యాసంస్థకుఅప్పగించే యోచన
కథ నడపుతున్న ఓ ఉన్నతాధికారి
విమ్స్ కథ కంచికి చేరబోతోందా!.. భయపడినంతా జరగబోతోందా!!... టీడీపీ ప్రభుత్వం అనుకున్నట్లుగానే విమ్స్‌ను ప్రైవేటుపరం చేయబోతోందా?....ప్రభుత్వస్థాయిలో చాపకింద నీరులా సాగుతున్న వ్యవహారాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. పేదలపాలిట సంజీవనిగా విమ్స్‌ను దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఏర్పాటు చేస్తే... చంద్రబాబు ప్రభుత్వం దాని ఉనికే లేకుండా చేయాలని చూస్తుండటం విస్మయపరుస్తోంది. ఇందుకోసం ప్రభుత్వస్థాయిలో టీడీపీ పెద్దలు పక్కాగా కథ నడుపుతుండగా... వైద్య శాఖ పరిధిలోని ఓ ఉన్నతాధికారి ఆ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు విమ్స్ కథను ముగించడానికి ప్రభుత్వ పన్నాగం ఇలా ఉంది...
విశాఖపట్నం: జిల్లాకు చెందిన ఓ టీడీపీ ప్రజాప్రతినిధి కుటుంబ విద్యా సంస్థలకు విమ్స్‌ను కట్టబెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దానిపై టీడీపీ పెద్దలు కన్నేశారు. అందుకోసం ఆయన సీఎం కార్యాలయ స్థాయిలోనే పావులు కదిపారు. అందుకే అధికారంలోకి వచ్చిన ఏడాది వరకు టీడీపీ ప్రభుత్వం విమ్స్ ఊసే ఎత్తలేదు. కానీ వ్యూహాత్మకంగా దాని స్థాయిని తగ్గిస్తూ వచ్చింది. రూ.250 కోట్లతో 1,130 పడకలు, 21 సూపర్ స్పెషాలిటీ వైద్య విభాగాలతో నిర్మించాలని మొదట నిర్ణయించారు. అందుకోసం దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆరిలోవలో 250 ఎకరాలు కేటాయించి తొలి విడతగా రూ.35.18 కోట్లు విడుదల చేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం విమ్స్‌ను 200 పడకలు, కేవలం 8 సూపర్‌స్పెషాలిటీ వైద్య విభాగాలుగా కుదించింది. కానీ వెంటనే ప్రైవేటుపరం చేస్తే ప్రజావ్యతిరేకత వస్తుందని ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసింది. తాజాగా అందుకు అనుకూలంగా పావులు కదుపుతోంది. అందుకోసం వైద్యశాఖలో ఓ ఉన్నతాధికారి ద్వారా కథ నడుపుతోంది.
కీలకంగా ఓ ఉన్నతాధికారి
విమ్స్‌ను ప్రైవేటుపరం చేసేలా దశలవారీగా వ్యూహాన్ని అమలు చేయడంలో ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి చెందిన ఓ ఉన్నతాధికారి కీలక పాత్ర పోషిస్తున్నారు. మరోసారి తన పదవీకాలాన్ని పొడిగించుకోవాలని ఆయన భావిస్తున్నారు. అందుకే ప్రభుత్వ పెద్దల ప్రాపకం కోసం విమ్స్ విషయంలో వారికి పూర్తిగా సహకరిస్తున్నారు. ఈమేరకు విశాఖ నగరానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి చెప్పినట్లుగా ఆయన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. విమ్స్‌లో పనిచేసేందుకు వైద్య సిబ్బంది లేరని, సూపర్‌స్పెషాలిటీ విభాగాల నిర్వహణ సాధ్యం కాదని తాజాగా తేల్చిచెప్పారు. కాబట్టి విమ్స్‌ను లీజుకు ప్రైవేటు సంస్థకు అప్పగిస్తేనే గానీ ఫలితం ఉండదన్నది ఆయన వాదన. ఇందుకోసం పక్కాగా ఫైలు తయారుచేసి ప్రభుత్వానికి త్వరలో పంపనున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఇక విమ్స్‌ను ప్రైవేటుపరం చేయడమే తరువాయి అవుతుంది. అలా విమ్స్ కథను కంచికి చేర్చడానికి ప్రభుత్వ పెద్దలు పక్కాగా పన్నాగం పన్నారు.
విమ్స్ నిర్వహణ మా వల్ల కాదంటూ...
విమ్స్ నిర్వహణ తమవల్ల కాదని నిరూపించేందుకు ప్రభుత్వం పన్నాగం పన్నింది. ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయానికి చెందిన ఓ ఉన్నతాధికారి ఈ విషయంలో ప్రభుత్వ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. మొదట విమ్స్‌ను 200 పడకలు, 8 సూపర్ స్పెషాలిటీ విభగాలుగా కుదించారు. రూ.30 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఉద్దేశపూర్వకంగానే ఆ నిధులు ఖర్చు చేయనే లేదు. తీరా ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు వస్తున్నందున ఆ నిధుల వినియోగం విషయాన్ని పట్టించుకోలేదు. కొన్ని రోజుల క్రితం విమ్స్‌ను ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి అప్పగించాలని నిర్ణయించారు. మరోవైపు విశ్వవిద్యాలయ నిధులతో విమ్స్ నిర్వహణకు సాంకేతికంగా అభ్యంతరాలు వస్తాయనే వాదనను తాజాగా తెరపైకి తెచ్చారు. ఈ నేపథ్యంలో ఇక ప్రైవేటుపరం చేస్తేగానీ విమ్స్ గాడిలో పడదని తాజాగా ప్రతిపాదించినట్లు సమాచారం. దీనిపై ఓ కమిటీ నియమించి అందుకు ఆమోదముద్ర వేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా ఉంది.
విమ్స్‌పై ప్రై‘వేటు’!?
Published Mon, Feb 29 2016 12:36 AM | Last Updated on Thu, Jul 11 2019 5:23 PM
Advertisement
Advertisement