దయనీయ స్థితిలో విద్యా వలంటీర్లు
హైదరాబాద్: గత సాధారణ ఎన్నికల్లో ‘ఇంటింటికీ ఓ ఉద్యోగం’ ఇస్తానన్న టీడీపీ అధినేత చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక ఉద్యోగం మాట దేవుడెరుగు.. ఉన్న తాత్కాలిక ఉద్యోగులకూ వేతనం సరిగా ఇవ్వడం లేదు. విద్యా వలంటీర్లతో 8 నెలలు చాకిరీ చేయించుకొని ఒక్క నెలకే వేతనం ఇచ్చి చేతులు దులుపుకున్నారు. గత విద్యా సంవత్సరం పనిచేసిన 7,671 మంది విద్యా వలంటీర్ల పరిస్థితి ఇదీ. మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న 1,252 మంది విద్యావలంటీర్లకు, ప్రతి పాఠశాలలో తాత్కాలిక పద్ధతిన పనిచేస్తున్న 7 వేల మంది డ్రాయింగ్, క్రాఫ్ట్, ఆరోగ్య విద్యాబోధకులకూ వేతనాలు సరిగా ఇవ్వడం లేదు. దీంతో సుమారు 16 వేల కుటుంబాలు దయనీయ స్థితిలో ఉన్నాయి. ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో తమ వేతనాలు మంజూరు చేయించడని నేతలను, అధికారులను వేడుకొంటున్నారు. 2014 సెప్టెంబర్‌లో రాష్ట్రవ్యాప్తంగా 7,671 మంది విద్యా వలంటీర్లను నియమించారు.
ప్రాథమిక పాఠశాలల టీచర్లకు రూ.5వేలు, ఉన్నత పాఠశాలల టీచర్లకు రూ.7వేల చొప్పున నెలకు వేతనం చెల్లించాలని నిర్ణయించారు. వీరి వే తనానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రభుత్వం జిల్లాలకు పూర్తిస్థాయిలో విడుదల చేయలేదు. దీంతో ఎనిమిది నెలలు పనిచేసినా డీఈఓలు ఒక నెలకు మాత్రమే వేతనం ఇచ్చి చేతులు దులుపుకున్నారు. విద్యాసంవత్సరం ముగిసి మూడు నెలలు గడిచిపోతున్నా ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం గమనార్హం. కాగా, మున్సిపల్ పాఠశాలల్లోనూ 1,252 విద్యా వలంటీర్లకు పూర్తిస్థాయిలో కన్సాలిడేషన్ వేతనాన్ని ఇవ్వలేదు. 7 వేల మంది డ్రాయింగ్, క్రాఫ్ట్, ఆరోగ్య విద్యాబోధనకు నియమించిన పార్ట్‌టైమ్ టీచర్లకు రెండు నెలలుగా వేతనాలు అందడం లేదని ఉపాధ్యాయ నేతలు పేర్కొంటున్నారు.
8 నెలల చాకిరీకి నెల జీతం
Published Wed, Jul 29 2015 1:10 AM | Last Updated on Thu, Jul 11 2019 5:23 PM
Advertisement