సాక్షి,నెల్లూరు: అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని ఆర్భాటపు ప్రకటనలు చేసిన చంద్రబాబు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిస్థితి కానరావడంలేదు. అదిగో..ఇదిగో.. అంటూ ఊరిస్తూ వచ్చిన డీఎస్సీ కూడా అసలు ఉంటుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. కోటి ఆశలతో ఎదురుచూసిన నిరుద్యోగులు చంద్రబాబు సర్కారు వైఖరితో ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే డీఎస్సీ ఉంటుందని ప్రకటించి నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తించారు. ముఖ్యంగా బీఈడీ, డీఈడీ పూర్తిచేసుకున్న అర్హులైన వేలాది మంది ఆశపడ్డారు. అధికారుల ప్రతిపాదనల మేరకు జిల్లాకు మొత్తం 416 పోస్టులు కేటాయించారు. వీటిలో ఎస్‌జీటీ 307, స్కూల్‌అసిస్టెంట్లు-57, లాంగ్వేజ్ పండిట్స్ -42, పీఈటీ-10 ఉన్నాయి.
రేషనలైజేషన్ విధానం పుణ్యమా అని చాలా పోస్టులు తగ్గిపోగా కొన్నిపాఠశాలల మూతపడడం కూడా కారణంగా తెలుస్తోంది. ఈ విధానం లేకపోతే జిల్లా స్థాయిలో వెయ్యి నుంచి రెండు వేల పోస్టులుండేవి. ఎక్కువ మంది అర్హులైన నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించేవి. జిల్లా స్థాయిలో బీఈడీ, డీఈడీ పూర్తిచేసిన నిరుద్యోగులు వేలసంఖ్యలో ఉన్నారు. వారంతా ఉద్యోగ అవకాశాలకోసం ఎదురు చూస్తున్నారు. మూడేళ్లుగా డీఎస్సీ లేకపోవడంతో నిరుద్యోగుల సంఖ్య మరింత పెరిగింది.ఎన్నికల హామీ పుణ్యమాని చంద్రబాబు అధికారం చేపట్టిన తరువాత డీఎస్సీ ఉంటుందని అందరూ భావించారు. అయితే ఆది నుంచి ప్రభుత్వం చిత్తశుద్ధితో డీఎస్సీ నిర్వహించేలా కనిపించలేదు.
మొదట రాష్ట్ర వ్యాప్తంగా 15 వేల పోస్టులు ఉంటాయని ప్రకటించిన ప్రభుత్వం ఆతరువాత వీటిని 10,200కు కుదించినట్లు పేర్కొంది. ఇది జరిగిన తరువాత సెప్టెంబర్ 5న డీఎస్సీ నోటిపికేషన్ ఉంటుందని విద్యాశాఖామంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. అందరూ ఆశగా ఎదురుచూశారు. కానీ ఎటువంటి ప్రకటనా వెలువడలేదు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తరువాత ఆర్థిక శాఖ అనుమతులు కేవలం 7,500 పోస్టులకే వచ్చాయని ఆర్థిక మంత్రి ప్రకటించారు.అనంతరం మరో 5 రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుం దని మంత్రి గంటా ప్రకటించి మరోమారు మాటలతో సరిపెట్టారు.
బుధవారంతో ఆ గడువూ ముగుస్తోంది. తరువాత ఏంచెబుతారో వేచి చూడాల్సి ఉంది. చేస్తున్న ప్రకటనలూ, జరుగుతున్న పరిణామాలు చూస్తే చంద్రబాబు సర్కార్ చిత్తశుద్ధితో వ్యవహరించడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాటలతో సరిపెట్టేలా కనిపిస్తోంది తప్ప సకాలంలో డీఎస్సీ నిర్వహించేలా కనిపించడంలేదు. ఎన్నికల్లో మాయమాటలు చెప్పి ఓట్లేయించుకొని గద్దెనెక్కిన చంద్రబాబు ఇప్పుడు తమను వంచించడం దారుణమని నిరుద్యోగులు మండిపడుతున్నారు.
కోతల డీఎస్సీ!
Published Wed, Sep 10 2014 2:07 AM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM
Advertisement
Advertisement