ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం అనంతరం సాగుతున్న పాలనలో అన్ని వర్గాలు ఆందోళనకు గురవుతున్నాయి. ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు, నిరుద్యోగులు, డ్వాక్రా మహిళలు, రుణ బాధితులు ఇలా ఏ వర్గాన్ని కదిపినా మానసిక వేదనే. అన్ని పథకాలకు పెట్టిన అడ్డగోలు నిబంధనల వరుసలో తాజాగా డీఎస్సీ చేరింది. నోటిఫికేషన్‌కు పొంగిపోయిన అభ్యర్థులు.. అందులో పితలాటకం చవిచూసి తలలు పట్టుకుంటున్నారు.
ఒంగోలు వన్‌టౌన్ : జిల్లాలోని పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేసేందుకు నిర్వహించనున్న టీచర్ ఎలిజిబులిటీ కమ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్(టెట్), డీఎస్సీ-2014లో గందరగోళం నెలకొంది. ఎట్టకేలకు ఉపాధ్యాయుల నియామకాలకు ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌కు పొంగిపోయిన అభ్యర్థులు.. అందులో పేర్కొన్న అడ్డగోలు నిబంధనలు చూసి కుంగిపోతున్నారు.
ప్రస్తుతం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థులు మళ్లీ టెట్, డీఎస్సీ-2014 రెండు పరీక్షలు కలిపి రాయాలి. గతంలో టెట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఆ మార్కులు ఏడేళ్ల వరకు చెల్లుబాటవుతాయని పేర్కొన్నారు. అయితే తాజా నోటిఫికేషన్‌లో మళ్లీ టెట్ రాయాలని నిర్ణయించడం, టెట్‌కు 20 శాతం వెయిటేజీ కేటాయించడంపై అభ్యర్థులు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. ఈసారి టీఆర్‌టీ ప్రశ్నపత్రాలు కచ్చితంగా ఉండటం కూడా అభ్యర్థులకు ఇబ్బందికరంగా మారనుంది.
గతంలో శిక్షణ పొందిన అభ్యర్థులు మళ్లీ శిక్షణ పొందక తప్పని పరిస్థితి. ఇది తమకు ఆర్థికంగా భారమవుతుందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో డీఎస్సీకి హాజరైన అభ్యర్థులు సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుకు ప్రస్తుతం ఉన్న పాఠ్యపుస్తకాల్లో 1 నుంచి 5వ తరగతి వరకు ఉన్న సిలబస్, స్కూలు అసిస్టెంట్ పోస్టులకు 6 నుంచి10వ తరగతి వరకు ఉన్న సిలబస్ ప్రామాణికంగా ఉండేది. తాజా నోటిఫికేషన్‌లో ఈ సిలబస్ ప్రామాణికత గురించి లేకపోవడంతో ఏయే అంశాలు ప్రిపేర్ కావాలన్న విషయాల్లో కూడా స్పష్టత లేకుండా పోయింది.
ఇబ్బంది పెడుతున్న నిబంధనలు
డీఎస్సీ-2014కు ప్రభుత్వం విధించిన నిబంధనలు నిరుద్యోగుల పాలిట ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. వందలాది మంది విద్యార్థులు డీఎస్సీకి అర్హత కోల్పోయే ప్రమాదం ఉంది. గతంలో అభ్యర్థులు డీఎస్సీ రాతపరీక్షకు హాజరై, వారు టీచర్ పోస్టుకు ఎంపికైన తర్వాతే సర్టిఫికెట్ల పరిశీలన చేసేవారు. ప్రస్తుత నోటిఫికేషన్‌లో అలా లేదు. డీఎస్సీకి దరఖాస్తు చేసే సమయంలో ఆన్‌లైన్‌లో ఏయే విద్యార్హతలున్నట్లు అభ్యర్థులు పేర్కొన్నారో.. ఆ సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు, ఆన్‌లైన్ దరఖాస్తు ప్రింటవుట్ జతచేసి డీఎస్సీ కౌంటర్లలో సమర్పించాలి.
ఇదే సమయంలో ఒరిజినల్ సర్టిఫికెట్లను కూడా పరిశీలిస్తున్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు రాని అభ్యర్థులు డీఎస్సీ అవకాశం కోల్పోయే ప్రమాదం ఉంది. డీఈడీ ద్వితీయ సంవత్సరం చదివే విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇప్పటి వరకు ఆ ఫలితాలు ప్రకటించలేదు. దీంతో వీరు డీఎస్సీ-2014కు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కోల్పోనున్నారు. గతంలో మాత్రం డీఈడీ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసిన అభ్యర్థులను కూడా డీఎస్సీకి అనుమతించారు.
బీకాం అభ్యర్థుల సమస్య
స్కూలు అసిస్టెంట్ పోస్టులకు బీకాం అభ్యర్థులను అర్హులుగా ప్రకటించిన ప్రభుత్వం.. సబ్జెక్టుల విషయంలో నిబంధనలు పెట్టి వారిని ఇబ్బందులకు గురిచేస్తోంది. ప్రభుత్వం జారీ చేసిన 38 జీఓ ప్రకారం కనీసం 4 సబ్జెక్టులున్న వారిని మాత్రమే స్కూలు అసిస్టెంట్ పోస్టుకు అర్హులు. అయితే ఇక్కడ యూనివర్శిటీ జారీ చేస్తున్న బీకాం డిగ్రీలో 3 సబ్జెక్టులు మాత్రమే ఉంటున్నాయి. వీటిలో ఒక సబ్జెక్టుగా కంప్యూటర్ ఫండమెంటల్స్ కూడా ఉంది. ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం బీకాం అభ్యర్థులకు నాలుగు సబ్జెక్టులు లేకపోవడంతో వీరి దరఖాస్తులు స్వీకరించేందుకు కౌంటర్‌లో సిబ్బంది నిరాకరిస్తున్నారు.
ఈ విషయాన్ని విద్యాశాఖ అధికారులు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. వికలాంగుల విషయంలో ఓహెచ్, వీహెచ్, హెచ్‌హెచ్ అభ్యర్థుల విషయంలో సర్టిఫికెట్లు ఎవరు జారీ చేయాలన్న విషయంలో కూడా స్పష్టత లేదు. అదే విధంగా స్కూలు అసిస్టెంట్ గణితం పోస్టు అర్హత విషయంలో కూడా స్పష్టత లేదు. గతంలో ప్రభుత్వం శాశ్వత కులధ్రువీకరణ పత్రాలను జారీ చేయగా.. తాజాగా మీ-సేవ ద్వారా తీసుకున్న కులధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని చెబుతున్నారు. ఈ విషయంలో కూడా స్పష్టత లేకపోవడంతో అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారు.
అయోమయం డీఎస్సీ
Published Fri, Dec 26 2014 1:24 AM | Last Updated on Sat, Jul 28 2018 6:48 PM
Advertisement
Advertisement