- 1606 పోస్టులకు ప్రతిపాదనలు పంపిన జిల్లా విద్యాశాఖ
చిత్తూరు(ఎడ్యుకేషన్): వేలాది మంది నిరుద్యోగులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ మరి కొద్ది రోజుల్లో వెలువడనుంది. సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం రోజున నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సోమవారం కుప్పంలో ప్రకటించారు. దీంతో జిల్లాలోని బీఈడీ, డీఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులు, గతంలో టెట్ రాసిన అభ్యర్థులు నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం జిల్లాలో 2679 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల డెరైక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (డీఎస్సీ) జీఓ నెం 55 ప్రకారం జిల్లాకు ఎన్ని పోస్టులు అవసరమవుతాయో వివరాలను తెలియజేయూలని విద్యాశాఖను ఆదేశించారు. దీని ప్రకారం అధికారులు జిల్లాకు ప్రస్తుతం 1606 ఉపాధ్యాయ పోస్టులు అవసరమని తేల్చారు. ఆ మేరకు వివరాలను డీఎస్సీకి పంపారు. ఈ 1606 పోస్టులే నోటిఫికేషన్ కింద రానున్నాయి.
ఇందులో ఎస్జీటీ-1194, స్కూల్ అసిస్టెంట్-221, భాషా పండితులు-182, పీఈటీ-9 పోస్టులున్నాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 10,603 పోస్టులు మాత్రమే డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. దీంతో జిల్లాకు ప్రతిపాదనలు పంపిన అన్ని పోస్టులు వస్తాయా ? లేక కోత పెడతారా ? అని నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది.