లక్ష్మీపురం పాఠశాలకు సరఫరా చేసిన సాంబారు లాంటి పప్పు
సాక్షి, దేవరపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి, విద్యార్థులకు పోషకాలతో కూడిన ఆహారం అందించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకం విద్యార్థులను అర్థాకలితో ఉంచుతుంది. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చేయాలంటే విద్యార్థులు భయపడిపోతున్నారు. సుమారు ఆరు నెలలుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొంది. పలువురు విద్యార్థులు ఇంటి వద్ద నుంచి భోజనం తెచ్చుకుంటున్నారు.
ఇంటి వద్ద భోజనం అందుబాటులో లేని విద్యార్థులు పాఠశాలలో పెడుతున్న భోజనం తిని అర్థాకలితో ఉంటున్నారు. ముతక రకం బియ్యం, రుచికరంగా లేని కూరలను విద్యార్థులకు సరఫరా చేయడం వల్ల తినడానికి విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారు. విద్యార్థులు తినకపోవడంతో చాలా పాఠశాలల్లో భోజనం నేలపాలవుతుంది. బుధవారం మెనూ ప్రకారం విద్యార్థులకు పప్పు, ఆకుకూర, కోడిగుడ్డు ఇవ్వవలసి ఉంది.
అయితే విద్యార్థులకు పెట్టిన భోజనం చిమిడి ముద్దగా ఉండంతో పాటు సాంబరులాంటి పప్పు అందజేశారు. కోడిగుడ్డు పాడైపోయి దుర్వాసన రావడంతో విద్యార్థులు ఇబ్బందిపడ్డారు. లక్ష్మీపురం పాఠశాలకు సరఫరా చేసిన భోజనం అధ్వానంగా ఉందని విద్యార్థులు తెలిపారు. చిమిడి ముద్దగా ఉన్న అన్నం, పలచని పప్పు, పాడైపోయిన కోడిగుడ్లు సరఫరా చేసినట్టు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
అన్నం ముద్దగా ఉండి గట్టిగా ఉంటుందని, రుచికరంగా లేని కూరలతో అన్నం తినలేకపోతున్నామని విద్యార్థులు వాపోయారు. 2018 డిసెంబర్ వరకు ప్రభుత్వ పాఠశాలల్లో డ్వాక్రా మహిళలు వంటలు చేసి విద్యార్థులకు అందజేసేవారు. అయితే ఈ ఏడాది జనవరి నుంచి వంట ఏజన్సీ మహిళలను తొలగించి ఢిల్లీకి చెందిన ఏక్తా శక్తి ఫౌండేషన్‌కు మధ్యాహ్న భోజనం సరఫరాను అప్పగించారు.
గోపాలపురం నియోజకవర్గంలోని నల్లజర్ల, గోపాలపురం, దేవరపల్లి మండలాలకు సంస్థ ద్వారా పాఠశాలలకు భోజనం సరఫరా చేస్తున్నారు. యర్నగూడెంలో భోజనాలు తయారుచేసి పాఠశాలలకు సరఫరా చేస్తున్నారు. అప్పటినుంచి మధ్యాహ్న భోజన పథకం గాడి తప్పింది. అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితంలేదు. అధికారుల పర్యవేక్షణ కొరవడిందని విద్యార్థులు విమర్శిస్తున్నారు.
బడిలో భోజనం చేస్తుంటే కడుపులో నొప్పి వస్తుందని విద్యార్థులు అంటున్నారు. బుధవారం పల్లంట్ల పాఠశాలకు వెళ్లిన ఎమ్మెల్యే తలారి వెంకట్రావుకు విద్యార్థులు మధ్యాహ్న భోజనం గురించి మొరపెట్టుకున్నారు. అన్నం తినలేకపోతున్నామని, సన్న బియ్యం అన్నం, రుచికరమైన కూరలు సరఫరా చేయాలని విద్యార్థులు ఎమ్మెల్యేను కోరారు. దీనిపై ఎమ్మెల్యే వెంకట్రావు ఫోన్‌లో జిల్లా విద్యాశాఖ అధికారితో మాట్లాడారు.
భోజనం విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే సహించనని, వెంటనే భోజనం సరఫరా చేస్తున్న ఏజన్సీతో మాట్లాడి నాణ్యతగల భోజనం సరఫరా చేయాలని సూచించారు. సమస్యను విద్యాశాఖా మంత్రి దృష్టికి తీసుకువెళతానని ఆయన అన్నారు. విద్యార్థులకు పెట్టే భోజనం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment