కదంతొక్కిన విద్యార్థులు | students dharna for fee reimbursement ,scholarship | Sakshi
Sakshi News home page

కదంతొక్కిన విద్యార్థులు

Published Sun, Nov 16 2014 1:48 AM | Last Updated on Wed, Sep 5 2018 9:18 PM

students dharna for fee reimbursement ,scholarship

ఒంగోలు టౌన్ : జిల్లాలోని విద్యార్థులు కదంతొక్కారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ జిల్లాశాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. ముందుగా స్థానిక హెచ్‌సీఎం జూనియర్ కాలేజీ నుంచి ప్రదర్శనగా బయలుదేరి ఉదయం 11.50 గంటలకు కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బీ రఘురామ్ మాట్లాడుతూ గత విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాలో 25 కోట్ల రూపాయల ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల బకాయిలు ఉన్నాయన్నారు. ప్రభుత్వం వాటిని విడుదల చేయకపోవడంతో వాటిపై ఆధారపడిన విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.

 ఎస్‌ఎఫ్‌ఐ బాలికల విభాగం కన్వీనర్ సౌజన్య మాట్లాడుతూ చీరాలలోని బాలికల వసతి గృహంలో బాత్‌రూమ్‌కు తలుపులు లేకపోవడంతో దుస్తులు అడ్డుపెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఆ వసతి గృహంలో 196 మంది బాలికలున్నప్పటికీ ఎలాంటి సౌకర్యాలూ కల్పించలేదన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు పీ కిరణ్, నాయకులు సీహెచ్ సుధాకర్, సీహెచ్ వినోద్, పీ రాంబాబు, చీరాల డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు పీ ఏసురాజు, జీ ఏసుబాబు, దర్శి డివిజన్ కార్యదర్శి ఎస్.కోటిరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు సీహెచ్ సుకుమార్, ఆదిత్య, సౌజన్య, రాజేంద్ర, అనిల్, దిలీప్, దుర్గాప్రసాద్, శ్యామ్, జీవన్, రాంగోపాల్  పాల్గొన్నారు.

  అరెస్టు చేసిన పోలీసులు...
 ముందుగా అధిక సంఖ్యలో విద్యార్థులు ఒక్కసారిగా కలెక్టరేట్ వద్దకు రావడంతో పోలీసులు అడ్డుకోలేకపోయారు. కలెక్టరేట్ గేట్లను తోసివేసేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. ఆ సమయంలో పోలీసులు అడ్డగించడంతో విద్యార్థులతో తీవ్ర వాగ్వాదం, కొద్దిసేపు తోపులాట జరిగింది. దీంతో విద్యార్థులు కలెక్టరేట్ గేటు ముందు బైఠాయించి ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు.

 మధ్యాహ్నం 12.17 గంటలకు పోలీసులు రంగంలోకి దిగి 18 మంది ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను బలవంతంగా అరెస్టుచేసి వ్యాన్‌లో టూటౌన్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. పోలీసుల చర్యను నిరసిస్తూ కలెక్టరేట్ నుంచి టూటౌన్ పోలీసుస్టేషన్ వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. కొద్దిసేపు పోలీసుస్టేషన్ ఎదుట బైఠాయించారు. అక్కడకు వచ్చిన ఒంగోలు డీఎస్పీ శ్రీనివాసరావును విద్యార్థి సంఘ నాయకులు కలిసి సమస్యను విన్నవించారు. అరెస్టు చేసిన వారిని సొంత పూచీకత్తుపై విడుదల చేయడంతో విద్యార్థులు నిష్ర్కమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement