ఆర్డీఓ కార్యాలయం ముందు బైఠాయించిన విద్యార్థులు
పాలకొండ : స్థానిక నగర పంచాయతీలో బీసీ బాలికల వసతిగృహం ఏర్పాటు చేయాలని కోరుతూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు పాలకొండ ప్రధాన రహదారిలో ర్యాలీ సోమవారం నిర్వహించి ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాలు, సీపీఐ నాయకులు మాట్లాడుతూ గతంలో ఎస్సీ బాలికల వసతి గృహంలో ఉంటూ బీసీ విద్యార్థినులు పలు కళాశాలల్లో చదువుతున్నారని గుర్తుచేశారు.
ఈ ఏడాది కూడా వసతి గృహంలో 37 మంది బీసీ విద్యార్థినులు చేరి పలు కళాశాలల్లో చదువుతున్నారని తెలిపారు. అయితే.. ఈ ఏడాది నుంచి ఎస్సీ వసతి గృహంలో బీసీ విద్యార్థినులు ఉండటాన్ని ప్రభుత్వం రద్దు చేయడంతో వారి భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఉండేందుకు వసతిలేక, కళాశాలలకు వెళ్లలేక అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉంటూ చదువులు కొనసాగిస్తున్నారని, ప్రస్తుతం వీరి పరిస్థితి ఎంటని ప్రశ్నించారు.
తక్షణమే పాలకొండలో బీసీ వసతి గృహాన్ని ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీఓ రెడ్డి గున్నయ్యను కలిసి పరిస్థితి వివరించారు. దీనిపై స్పందించిన ఆయన.. సమస్యను కలకర్ట్ దృష్టికి తీసుకు వెళ్లానని, బీసీ వసతి గృహం మంజూరుకు చర్యలు తీసుకునేందుకు ఆయన హమీ ఇచ్చారని వివరించారు. అంతవరకు ఇతర వసతి గృహల్లో ఈ విద్యార్థినులను ఉంచేందుకు చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment