ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లోని విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ జిల్లాశాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. ముందుగా స్థానిక హెచ్‌సీఎం జూనియర్ కాలేజీ నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు ప్రదర్శనగా బయలుదేరి కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. వారిని లోపలికి వెళ్లనీయకుండా గేట్లువేసి పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులంతా రోడ్డుపైనే బైఠాయించడంతో అరగంటకుపైగా రాకపోకలకు అంతరాయం కలిగింది. అధికారులు అక్కడకు వచ్చి విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
అంతకుముందుగా విద్యార్థులనుద్దేశించి ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బీ రఘురామ్ మాట్లాడుతూ ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమై ఆరు నెలలవుతున్నా ఇంతవరకు ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరిం చకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. నిధులు ఉన్నప్పటికీ ఖర్చు చేయకుండా చోద్యం చూస్తున్నారన్నారు. విద్యార్థులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా వారు మాత్రం ఏసీ గదుల్లో కూర్చుని ఏంజాయ్ చేస్తున్నారన్నారు. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోందన్నారు. స్కాలర్‌షిప్, ఫీజురీయింబర్స్‌మెంట్ నిధులను కూడా సకాలంలో విడుదల చేయకుండా విద్యార్థులను ఇబ్బందిపెడుతున్నారన్నారు.
కొన్ని నెలలకు సంబంధించిన కాస్మోటిక్ చార్జీలు పెండింగ్‌లో ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. తామేమీ గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని, విద్యార్థులకు కేటాయించిన నిధులను వారికే వినియోగించాలని విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలపై దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ అధికారులు స్పందించకపోవడంతో కలెక్టరేట్‌ను ముట్టడించినట్లు తెలిపారు. అధికారులు ఇప్పటికైనా నిర్లక్ష్యాన్ని విడనాడకుంటే విద్యార్థుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు.
డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వీ బాలకోటయ్య మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులకు సౌకర్యాలు కల్పించలేని ప్రభుత్వం ఫీజులు మాత్రం పెంచుకుంటూ పోతోందని విమర్శించారు. విద్యార్థులకు సంబంధించి మూడు కోట్ల రూపాయల బడ్టెట్ ఉన్నా.. అధికారులు వాటిని ఖర్చు చేయడం లేదన్నారు. కనీస సౌకర్యాలు లేకపోవడంతో వసతి గృహాలు మూతపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలు విన్నవించేందుకు ప్రభుత్వ కార్యాలయాలకు వస్తే అధికారులు ఉండటం లేదన్నారు. సమస్యలు పరిష్కరించేంత వరకు అధికారులు, పాలకులను విద్యార్థులు నిలదీయాలని పిలుపునిచ్చారు. ఐద్వా రాష్ట్ర నాయకురాలు కే సుబ్బరావమ్మ మాట్లాడుతూ బాలికల వసతి గృహాల్లో సరైన సౌకర్యాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. బాలికల వసతి గృహాలకు ఎలాంటి రక్షణా లేకపోవడంతో వారు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రెండు రోజుల్లో అధికారులతో సమావేశం...
విద్యార్థుల సమస్యలపై రెండురోజుల్లో అధికారులతో సమావేశం ఏర్పాటుచేసి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టరేట్ పరిపాలనాధికారి జ్వాలానరసింహం హామీ ఇచ్చారు. జాయింట్ కలెక్టర్ యాకూబ్ నాయక్ ఆదేశాల మేరకు ఆందోళన చేస్తున్న విద్యార్థులతో ఆయన మాట్లాడారు. ఎస్‌ఎఫ్‌ఐ ప్రతినిధి బృందంతో చర్చలు జరుపుతామని, విద్యార్థులు జీరో బ్యాలెన్స్ అకౌంట్లు ప్రారంభించేలా బ్యాంకులకు ఆదేశాలిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘ నగర కార్యదర్శి అత్తంటి శ్రీనివాసరావు, గిరిజన సంఘ జిల్లా కార్యదర్శి రాపూరి శ్రీనివాసరావు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు టీ మహేష్, పీ కిరణ్, వీ అంజిబాబు, పీ ప్రవీణ్, పీ ఏసురత్నం, నగర అధ్యక్ష, కార్యదర్శులు పీ రాంబాబు, సీహెచ్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.