బాబూ..సెట్ చేయరా? | students have concern on fee reimbursement | Sakshi
Sakshi News home page

బాబూ..సెట్ చేయరా?

Published Tue, Jul 15 2014 1:49 AM | Last Updated on Wed, Sep 5 2018 9:18 PM

బాబూ..సెట్ చేయరా? - Sakshi

బాబూ..సెట్ చేయరా?

కర్నూలు కలెక్టరేట్‌లో పనిచేసే రామకృష్ణ కుమారునికి ఎంసెట్ ఇంజనీరింగ్‌లో మంచి ర్యాంకు వచ్చింది. అయితే అతనికి ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించదు. ఫలితాలు విడుదలై నెల రోజులు దాటినా ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు తేదీ ప్రకటించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు కుమారున్ని హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రైవేటు కాలేజీలో రూ.లక్షకు పైగా ఫీజు చెల్లించి చేర్పించారు.
 
కర్నూలు నగరం కృష్ణానగర్‌కు చెందిన చంద్రశేఖర్‌యాదవ్ కూతురు ఎంసెట్‌లో ర్యాంకు సరిగ్గా రాలేదు. కనీసం కూతురును బీ ఫార్మసీ అయినా చేర్పించాలని భావించాడు. కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా అడ్మిషన్లపై స్పష్టత లేకపోవడంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బీ ఫార్మసీలోనూ అడ్మిషన్ రాకపోతే కనీసం డిగ్రీలో అయినా చేర్పించడానికి అప్పటికి డిగ్రీ కాలేజీల్లో సీట్లు ఉంటాయో లేదోనన్న ఆందోళన వారిలో నెలకొంది. ఒకవేళ సీటు దక్కినా అప్పటికే రెండు నెలల సిలబస్ అయిపోతుందన్న బెంగ వారిలో మొదలైంది.
 
కర్నూలులోని ఖండేరి వీధికి చెందిన రాజశేఖర్ ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. అతని కుమారుడు మహేష్ పాలిసెట్ పరీక్ష రాసి ర్యాంకు సాధించాడు. పాలిటెక్నిక్ ఫలితాలు వెలువడి నెల రోజులు దాటినా అడ్మిషన్ల తేదీ ప్రకటించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. మరోవైపు జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లు సైతం పూర్తయ్యాయి. పాలిటెక్నిక్ తరగతులు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియకపోవడం, మరోవైపు రెండు నెలల నుంచి కుమారుడు ఇంటి వద్దే ఉండటంతో తల్లిదండ్రుల్లో ఆందోళన ఎక్కువైంది.
 
కర్నూలు మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు తన కుమార్తెను కర్ణాటక రాష్ట్రంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో చేర్పించాడు. ఆమెకు మంచి ర్యాంకు వచ్చినా ఇక్కడ అడ్మిషన్ ఆలస్యం కావడంతో, జిల్లాలో మంచి కాలేజీలు లేవన్న ఉద్దేశంతో కూతురును కర్ణాటకకు పంపించాల్సి వచ్చింది.
 
 కర్నూలు (విద్య): ఇలా వివిధ రకాల సెట్‌లు రాసి అడ్మిషన్ల కోసం విద్యార్థినీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. అన్ని రకాల సెట్‌ల ఫలితాలు విడుదలయ్యాయి. కానీ కౌన్సెలింగ్ నిర్వహించకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలవుతోంది. అడ్మిషన్ల కోసం కౌన్సెలింగ్ ఎప్పుడు జరుగుతుందో.. తరగతులు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియక మదనపడుతున్నారు. మరోవైపు వచ్చిన ర్యాంకుకు అనుగుణంగా మంచి కాలేజిలో సీటు వస్తుందా...రాదా.. ఒకవేళ రాకపోతే ఏం చేయాలి. అడ్మిషన్లు పూర్తయ్యే నాటికి ఇతర కోర్సుల్లో సీటు లభించే అవకాశం దొరుకుతుందో లేదో...?, దొరికినా అప్పటికి రెండు నెలల సిలబస్ పూర్తవుతుందన్న ఆందోళన  ప్రతి ఒక్కరినీ వేధిస్తోంది.
 
ఈ నేపథ్యంలో జిల్లాలో ఎంసెట్ రాసి ఇంజనీరింగ్‌లో అర్హత సాధించిన విద్యార్థుల్లో ఇప్పటికే 30 శాతం మంది ఇతర రాష్ట్రాల్లోని ప్రైవేటు కాలేజీల్లో చేరడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. జిల్లాలో ఎంసెట్, డైట్‌సెట్, ఎడ్‌సెట్, పాలిసెట్, ఈసెట్, పీజీసెట్ రాసి అడ్మిషన్ల కోసం అర్హత సాధించిన విద్యార్థులు 40 వేల వరకు ఉన్నారు. గత నెల 9న డైట్‌సెట్, 19న ఎడ్‌సెట్, 4న పాలిసెట్, 9న ఎంసెట్, 20న ఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో ఆర్‌యూ పీజీకి మాత్రమే కౌన్సెలింగ్ నిర్వహించారు. 

పాలిసెట్‌కు సంబంధించి సర్టిఫికెట్ల పరిశీలన మాత్రమే పూర్తయింది. ఇప్పటిదాకా అన్ని సెట్‌లకు కూడా అడ్మిషన్లు ప్రారంభంకాలేదు. కనీసం కౌన్సెలింగ్ తేదీలను సైతం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించలేదు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలుపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు పీటముడి విప్పకపోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది.
 
పూరి గుడిసెలో ఉన్న పేదవాడు కూడా తన పిల్లలను ప్రొఫెషనల్ కోర్సులు చదివించాలన్న ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖరరెడ్డి జీవో నెం. 18, 50, 66ల ద్వారా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా ఎస్‌సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓబీసీ విద్యార్థులు ఆదాయపు ధ్రువపత్రాన్ని సమర్పించి ఉచితంగా ఉన్నత విద్యను అందుకునే వీలుంది. కానీ రెండు రాష్ట్రాల్లోని కొత్త ప్రభుత్వాలు ఈ పథకం అమలుపై ఎటూ తేల్చలేకపోతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో చదివే విద్యార్థులకు సైతం ఈ పథకం ద్వారా ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చే సౌలభ్యం ఉన్న దృష్ట్యా రెండు రాష్ట్రాల్లో ఈ పథకం అమలుపై తేల్చకపోవడంతో అనుమానాలకు తావిస్తోంది.
 
దీనికితోడు ఇరు రాష్ట్రాల్లో పదేళ్లపాటు విద్యార్థులు అభ్యసించే అవకాశాలు ఉన్నా ప్రభుత్వాలు మాత్రం తాత్సారం చేయడం విద్యార్థుల్లో ఆందోళనకు గురిచేస్తోంది. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం  పథకాన్ని అమలు చేసేందుకు సవాలక్ష కారణాలు చూపి కొర్రీలు పెట్టి విద్యార్థులను వేధించింది. తాజాగా కొత్త ప్రభుత్వం పథకాన్ని పూర్తిగా ఎత్తేసేందుకు కుట్ర పన్నుతుందన్న విమర్శలూ వ్యక్తం అవుతున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంపై స్పష్టత వస్తేనే అన్ని సెట్‌లకు సంబంధించి అడ్మిషన్లు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ దిశగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలు త్వరగా నిర్ణయం తీసుకోవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement