మధ్యాహ్న భోజనానికి దూరమవుతున్న విద్యార్థులు
Published Sat, Aug 17 2013 4:10 AM | Last Updated on Fri, Sep 1 2017 9:52 PM
వేటపాలెం బీబీహెచ్ పాఠశాలలో 550 మంది విద్యార్థులుంటే 50 నుంచి 60 మంది మాత్రమే మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. వేటపాలెం జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో 600 మందికి 70 మంది మాత్రమే భోజనం చేస్తున్నారు. పందిళ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 600 మంది విద్యార్థులకు 75 మంది భోజనం చేస్తున్నారు. మిగిలిన విద్యార్థులంతా ఇళ్లకు వెళ్లి భోజనం చేస్తున్నారు. దీన్ని గమనిస్తే విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ఏ విధంగా ఉపయోగపడుతుందో అర్థమవుతోంది. రోజూ చారన్నం తినలేక విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకానికి దూరమవుతున్నారు. ఈ పరిస్థితికి కారణం కూరగాయలు, నిత్యవసరాల ధరలు పెరగడమే. మెనూ ఎక్కడా అమలు కావడం లేదు. మెనూ ప్రకారం వండటం తమ వల్లకాదని కుకింగ్ ఏజెన్సీలు తేల్చి చెబుతున్నాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో హాజరుశాతం పెంచేందుకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఒక్కో విద్యార్థికి 100 గ్రాములు, ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఒక్కో విద్యార్థికి 150 గ్రాముల చొప్పున బియ్యం సరఫరా చేస్తారు. భోజనంతో పాటు ఆకుకూర, పప్పు, కూరగాయలు, సాంబారు వడ్డించాలి. అంతేకాకుండా వారానికి రెండుసార్లు గుడ్డు ఇచ్చేలా విద్యాశాఖ మెనూ తయారు చేసింది. చీరాల మండలంలో మొత్తం 98 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. కుకింగ్ ఏజెన్సీల ద్వారా భోజనాన్ని సరఫరా చేస్తున్నారు. బియ్యం మాత్రమే ప్రభుత్వం అందిస్తుండగా మిగిలిన వాటికి ఒక్కో విద్యార్థికి రూ. 4.40 చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. నిత్యావసరాలు, కూరగాయల ధరలు పెరిగిపోవడంతో మెనూ ప్రకారం భోజనాన్ని తయారు చేయలేకపోతున్నారు. కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో కూరలకు బదులు చారన్నంతోనే విద్యార్థులు ఆకలి తీర్చుకుంటున్నారు.
మెనూ ప్రకారం వడ్డించాలంటే సాధ్యపడదంటూ కుకింగ్ ఏజెన్సీలు చేతులెత్తేస్తున్నాయి. కూరగాయల ధరలు ఒక్కో రకం కేజీ రూ. 30 పైగా ఉంది. గ్యాస్, కోడిగుడ్డు ధర చుక్కలనంటడంతో ప్రభుత్వం నిర్ణయించిన ధరలతో మధ్యాహ్న భోజనం తయారు చేయలేక ఏజెన్సీలు అవస్థలు పడుతున్నాయి. చేసేది లేక కూరగాయలకు బదులు చారు, సాంబారుతోనే సరిపెడుతున్నారు. కూరగాయల ధరలు పెంచకూడదని అధికారులు వ్యాపారులకు చెబుతున్నా దిగుమతులు లేవంటూ తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. కోడిగుడ్డు ఒక్కోటి రూ.4 వరకు ఉండటంతో వారానికి రెండు కోడిగుడ్లు కూడా భోజనంలో అందించలేమని చెబుతున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఏజెన్సీలకు ఇచ్చే మొత్తం పెంచాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఏజెన్సీలకు నగదు పెంచే విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో విద్యార్థులకు భోజనం వండి పెట్టే బాధ్యతల నుంచి తప్పుకునేందుకు కొందరు సిద్ధపడుతున్నారు. ఏజెన్సీలకు రావాల్సిన నెలవారీ బిల్లులు కూడా వాయిదాలు పడటంతో మధ్యాహ్న భోజన పథకం పాఠశాలల్లో కుదేలయ్యేలా ఉంది. మెనూ ప్రకారం బుధవారం పప్పు, ఆకుకూర వడ్డించాల్సి ఉండగా కేవలం సాంబారు మాత్రమే పెట్టారు. బడిఈడు పిల్లలు పౌష్టికాహార లోపంతో బడిమానేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతం పెంచేందుకు ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకం నేడు పెరిగిన ధరలతో నిర్వీర్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పథకం సక్రమంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటే విద్యార్థులకు పౌష్టికాహారంతో పాటు నాణ్యమైన విద్యనందించవచ్చు.
Advertisement