ఘర్షణలో విద్యార్థులకు గాయాలు
కడప అర్బన్ : కడప నగరంలోని ఆర్ట్స్ కళాశాల సమీపంలో ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘ నాయకులు తమ సంఘానికి సంబంధించిన జెండాను ఆవిష్కరించుకునేందుకు స్తంభం నిర్మాణం కోసం ప్రయత్నించారు. అదే కళాశాలకు చెందిన మరికొంతమంది విద్యార్థులు కళాశాల ఆవరణంలో విద్యార్థి సంఘం జెండాను ఆవిష్కరించుకునేందుకు అభ్యంతరం తెలిపారు.
ఈ క్రమంలో ఆ ఇరు వర్గాల వారు పరస్పరం ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో ఎస్‌ఎఫ్‌ఐకి చెందిన ఏకాంబరంతోపాటు రవి, భరత్, అంకిరెడ్డిలు గాయపడ్డారు. మరోవైపు ఇరువురు విద్యార్థులను ఘర్షణకు కారణం వారేనని ఆరోపించడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుస్టేషన్ ఎదుట ఆందోళన
ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘం నాయకులపై జరిగిన దాడిని నిరసిస్తూ సీఐటీయూ జిల్లా కార్యదర్శి శివశంకర్, సీపీఎం నగర ప్రధాన కార్యదర్శి రవిశంకర్‌రెడ్డి, సీపీఎం నాయకులు వన్‌టౌన్ పోలీసుస్టేషన్ వద్దకు వచ్చి ఆందోళన చేశారు. తమ విద్యార్థి సంఘం నాయకులపై దాడులు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్బంగా వన్‌టౌన్ సీఐ కె.రమేష్ మాట్లాడుతూ ఘర్షణ జరిగింది చిన్నచౌకు పరిధిలోనని, జెండా స్తంభాన్ని నాటుకునే వ్యవహారం తమ పరిధిలోకి వస్తుందని, విచారిస్తామన్నారు. ఘర్షణ జరిగిన ప్రాంతంలో ఉన్న విద్యార్థులను చిన్నచౌకు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చిన్నచౌకు సీఐ యుగంధర్‌బాబు తెలిపారు.