ఒకే గదిలో ఇరుకుగా పడుకున్న విద్యార్థినులు
సాక్షి, నర్సీపట్నం(విశాఖపట్నం) : కస్తూర్బా పాఠశాలను తొలుత మాకవరపాలెం ప్రాథమిక పాఠశాలలో అరకొర సౌకర్యాల మధ్య ప్రారంభించారు. దీంతో ఏళ్ల తరబడి విద్యార్థులు ఇబ్బందులు పడుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో 2015లో భీమబోయినపాలెం సమీపంలో కొండ ప్రాంతంలో కొత్త భవనం నిర్మించడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు సంతోషించారు. ఇక నుంచి తమకు వసతి సమస్య తప్పినట్టేనని వారు సంబరపడ్డారు. కానీ ఈ కొత్త భవనంలో విద్యార్థులకు సరిపడిన గదులు లేకపోవడంతో నిత్యం అవస్థలు పడుతున్నారు. ఈ భవనం ప్రారంభించి నాలుగేళ్లు కావస్తున్నా ఇప్పటికీ అదనపు గదులు నిర్మించక పోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.
నాలుగేళ్లయినా అలాగే..
ఈ పాఠశాలకు ప్రస్తుతం తొమ్మిది గదులు ఉన్నాయి. వీటిలో ఐదింటిలో తరగతులు, ఒక గదిలో ఆఫీస్, మరో గదిలో కంప్యూటర్, స్టాఫ్ రూమ్‌గా వినియోగిస్తున్నారు. ఇక మిగిలిన రెండు గదులు మాత్రమే 200 మంది విద్యార్థులు రాత్రి సమయంలో నిద్రించేందుకు ఉన్నాయి. ఇవి చాలక విద్యార్థులు ఉన్న వాటిలోనే తమ సామగ్రిని పెట్టుకుని ఇరుకుగా పడుకుంటున్నారు. నాలుగేళ్లుగా ఇదే పరిస్థితి ఉన్నా పట్టించుకునేవారు లేకపోవడంతో విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. ప్రస్తుతం మరో రెండు గదులు డార్మెటరీకి, మూడు గదులు గ్రంథాలయం, ల్యాబ్‌కు అవసరం. మొత్తం ఐదు గదులు మంజూరు చేస్తే ఇక్కడి విద్యార్థులకు, సిబ్బందికి పూర్తిగా ఇబ్బందులు తొలగిపోతాయి.
అయ్యన్న హామీ ఇచ్చినా..
ఈ పాఠశాలను ప్రారంభించిన అప్పటి మంత్రి అయ్యన్న కొండ ప్రాంతంలో నిర్మించడమేంటని అధికారులను ప్రశ్నించారు. అయితే భవనానికి రక్షణగా చుట్టూ ప్రహరీ నిర్మాణానికి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. దీంతోపాటు ప్రధాన రహదారి నుంచి పాఠశాల వరకు తారురోడ్డు నిర్మాణానికి కూడా ప్రతిపాదించాలన్నారు. గదుల కొరత కారణంగా మరో మూడు అదనపు గదులను నిర్మించేందుకు నిధులు మంజూరు చేయిస్తామని కస్తూర్బా పాఠశాలలో నిర్వహించిన సమావేశంలోనే అప్పటిలో ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో మూడేళ్ల అనంతరం రోడ్డు పనులు చేపట్టారు. ఇక ప్రహరీ నిర్మాణం జరగలేదు. ఇక అదనపు గదుల హామీ ఇప్పటికీ అమలు చేయకపోవడంతో నిత్యం విద్యార్థులు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment