బంద్ సక్సెస్ | Success Bandh | Sakshi
Sakshi News home page

బంద్ సక్సెస్

Published Sun, Aug 30 2015 2:10 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

బంద్ సక్సెస్ - Sakshi

బంద్ సక్సెస్

♦ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కదం తొక్కిన నేతలు
♦ జిల్లావ్యాప్తంగా నిలిచిన రాకపోకలు
♦ బంద్ విఫలం చేసేందుకు పోలీసుల యత్నం
♦ వెనక్కు తగ్గని వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు
♦ బంద్‌లో పాల్గొన్న సీపీఐ, సీపీఎం, బీఎస్పీ, ఎమ్మార్పీఎస్  ప్రజాసంఘాల నాయకులు
 
 సాక్షి ప్రతినిధి, గుంటూరు : రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ,  మిత్రపక్షాలు జిల్లాలో శనివారం చేపట్టిన బంద్ విజయవంతమైంది. ఆర్టీసీ, ప్రైవేటు బస్‌ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వాణిజ్యవర్గాలు స్వచ్ఛందంగా సహకరించి దుకాణాలు తెరవలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు పనిచేయలేదు. మధ్యాహ్న సినిమా ప్రదర్శనను నిలిపివేశారు. వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు తెల్లవారుజామునే బస్టాండ్ సెంటర్లకు చేరుకున్నారు. శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తున్నా కొన్నిచోట్ల నాయకులను రెచ్చగొట్టే విధంగా పోలీసులు వ్యవహరించారు.  అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, అనుబంధ విభాగాల నేతలను అరెస్టు చేశారు. సీపీఐ, సీపీఎం, బీఎస్పీ, ఎమ్మార్పీఎస్, ఇతర ప్రజా సంఘాల నాయకులు ఈ బంద్‌లో పాల్గొన్నారు.

 పోలీసుల అత్యుత్సాహం.. చిలకలూరిపేటలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో కార్యకర్తలు, నాయకులు బంద్ నిర్వహించారు.  శాంతియుతంగా బంద్ చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకువెళ్లారు. ఇందుకు నిరసనగా పార్టీ శ్రేణులు భారీ ర్యాలీని నిర్వహించగా, మధ్యాహ్నం విడుదల చేశారు. మాచర్లలో బంద్‌ను నిర్వహిస్తున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకష్ణారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకట రామిరెడ్డిలను అరెస్టు చేసే సమయంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఈ ప్రయత్నాన్ని నిలువరించే ప్రయత్నంలో ఎమ్మెల్యే చొక్కా చిరిగింది. 

మంగళగిరిలో ఎమ్మెల్యే ఆళ్ల రామకష్ణారెడ్డి  బస్టాండ్ వద్ద బస్‌ల రాకపోకలను నిలువరించారు. పోలీసులు ఎమ్మెల్యేను అరెస్టు చేయగా, నిరసనగా కార్యకర్తలు పోలీసుస్టేషన్‌ను ముట్టడించారు. నరసరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు, నాయకులు ద్విచక్రవాహనాలతో ర్యాలీ చేశారు. పోలీసులు ఎమ్మెల్యేను అరెస్టు చేయగా, ఆయన్ను వెంటనే విడుదల చేయాలని కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేసి కార్యకర్తలను స్టేషన్‌కు తీసుకువెళ్లారు. బాపట్లలో ఎమ్మెల్యే కోన రఘుపతి ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించి బంద్‌ను విజయవంతం చేశారు.

 బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు.. మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణ రేపల్లెలో బంద్ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. సత్తెనపల్లిలో బస్‌ల రాకపోకలను నిలువరిస్తున్న రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబుతో సీఐ సాంబశివరావు వాగ్వాదానికి దిగారు. అంబటిని బలవంతంగా పోలీస్టేషన్‌కు లాక్కెళ్లారు. అనంతరం విడుదల చేశారు. పొన్నూరు లో నియోజకవర్గ ఇన్‌చార్జి రావి వెంకట రమణ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు పట్టణంలో బంద్ నిర్వహించారు.  వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకువెళ్లారు. తాడికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి కత్తెర హెనీ క్రిస్టినా ఆధ్వర్యంలో బంద్ కార్యక్రమం జరిగింది. తుళ్లూరులో సీఆర్‌డీఏ కార్యాలయాన్ని మూసివేయించారు. గురజాల నియోజకవర్గ ఇన్‌చార్జి జంగా కష్ణమూర్తి పిడుగురాళ్ళలో బంద్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

 పలు నియోజకవర్గాల్లో.. ప్రత్తిపాడు నియోజకవర్గంలో రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి విజయసారధి, రూరల్ జెడ్పీటీసీ కొలకలూరి కోటేశ్వరరావు, మండల పార్టీ కన్వీనర్ల ఆధ్వర్యంలో బంద్ కార్యక్రమం విజయవంతమైంది. వేమూరు నియోజకవర్గ ఇన్‌చార్జి మేరుగ నాగార్జున తెనాలిలో జరిగిన బంద్ కార్యక్రమంలో పాల్గొనగా, మండల పార్టీ కన్వీనర్లు బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పెదకూరపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి పానెం హనిమిరెడ్డి ఆధ్వర్యంలో అమరావతిలో బంద్ జరిగింది. తెనాలి నియోజకవర్గంలో పార్టీ రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున, తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్‌లు బస్సుల రాకపోకలను నిలువరించారు. మేరుగ నాగార్జునను పోలీసులు అరెస్ట్ చేసి అమృతలూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. శివకుమార్ తెనాలి పట్టణంలో భారీ ర్యాలీతో తిరుగుతూ బంద్‌ను నిర్వహించారు.

 నాయకులు అరెస్టు..  వినుకొండ బస్టాండ్ సెంటరులో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టిన ఆ నియోజకవర్గ ఇన్‌చార్జి బొల్లా బ్రహ్మనాయుడు, ఇతర కార్యకర్తలను అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకువచ్చారు. కార్యకర్తలు శివయ్య స్థూపం వద్ద ధర్నా చేశారు. అనంతరం స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు.  వేమూరులో పార్టీ రాష్ర్ట సంయుక్త కార్యదర్శి చందోలు డేవిడ్  విజయకుమార్, రాష్ర్ట మహిళా ప్రధాన కార్యదర్శి దాడి వెంకటలక్ష్మీరాజ్యం ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు.

 గుంటూరు నగరంలో సంపూర్ణ బంద్.. గుంటూరు నగరంలో వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు ఎండీ నసీర్ అహ్మద్, రాతంశెట్టి రామాంజనేయులు (లాలుపురం రాము), యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కావటి మనోహర్‌నాయుడు ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement