
సమావేశంలో పాల్గొన్న నియోజకవర్గ బూత్ స్థాయి కమిటీ సభ్యులు (ఇన్‌సెట్లో) మాట్లాడుతున్న బెల్లాన, పక్కన కోలగట్ల
సాక్షి, విజయనగరం మున్సిపాలిటీ: క్రమశిక్షణతో పనిచేస్తే వైఎస్సార్‌సీపీ విజయం తథ్యమనీ, దానికి బూత్‌కమిటీ కన్వీనర్లు, సభ్యులు కీలకభూమిక పోషించాలని ఆ పార్టీ విజయనగరం ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. పట్టణంలోని సుజాత కన్వెన్షన్ హాల్‌లో మంగళవారం రాత్రి నిర్వహించిన పార్టీ నియోజకవర్గ బూత్ కమిటీ కన్వీనర్లు, సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయించి గెలిపించటంలో మీరంతా క్రియా శీలక పాత్ర పోషించాలన్నారు. ప్రస్తు తం ఎన్నికల విధానాలు పూర్తిగా మారిపోయాయని, ప్రతీ ఓటురును ప్రభావితం చేయాల్సిన అవసరం ఉం దన్నారు. ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి ఆయా ఓటర్లు ఎక్కడున్నదీ గుర్తించి ఎన్నికలకు సిద్ధం చేయాలని సూచించారు. ఈ ఎన్నికలు పార్టీకి ఎంతో కీలకమని, జిల్లా కేంద్రంపై అందరి దృష్టి ఉంటుందన్నారు.
విజయనగరం ఎమ్మెల్యే అభ్యర్థిగా కోలగట్ల వీరభద్రస్వామిని గెలిపించడం ద్వారా జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో ఓటర్లను ప్రభావితం చేయగలగాలని పిలుపునిచ్చారు. నవరత్నాల పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలన్నారు. పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ సాధిస్తామన్నారు. విజయనగరం పట్టణంలో తాగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కార మార్గం చూపిస్తామన్నారు. భోగాపురంలో నిర్మించతలపెట్టిన ఎయిర్‌పోర్ట్‌ను పూర్తి చేసి జిల్లా వాసులకు ఉపాధి, ఉద్యోగావకావకాశాలు పెంపొందిస్తామన్నారు.
విజయనగరం ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా బెల్లానను గెలిపించుకుని జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని బలపరుద్దామన్నారు. పార్టీ అధికారంలోకి వస్తే ప్రజా సమస్యలను పరిష్కరించటంతో పాటు సంక్షేమ పాలన అంటే ఏమిటో చూపిస్తామని, ఈ విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు. పార్టీ విజయనగరం పట్టణ అధ్యక్షుడు ఆశపు వేణు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు నడిపేన శ్రీనివాసరావుతో పాటు పలువురు జిల్లా, మండల, పట్టణ నాయకులు, బూత్‌కమిటీ కన్వీనర్లు, సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment