ఎంపీ బెల్లాన నుంచి జ్ఞాపికను అందుకుంటున్న కేంద్రమంత్రి చంద్ర సారంగి
సాక్షి, విజయనగరం : స్వాంతత్య్రం వచ్చిన తొలినాళ్లలో చేసిన చారిత్రాత్మక తప్పిదాన్ని సవరించి దేశాభివృద్ధి ఆటంకాలను తొలగిస్తే కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు విమర్శిస్తున్నారని కేంద్ర పశుసంవర్ధకశాఖ మంత్రి ప్రతాప్ చంద్ర సారంగి ఆరోపించారు. కేంద్రం రద్దు చేసిన ఆర్టికల్ 370 రద్దు అంశంపై బీజేపీ దేశవ్యాప్తంగా చేపడుతున్న ‘జనజాగరణ’ సభల నిర్వహణలో భాగంగా పట్టణంలోని స్థానిక ఆనందగజపతి ఆడిటోరియంలో బుధవారం జరిగిన సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కశ్మీరుపై 72 సంవత్సరాల క్రితం విధించిన చారిత్రాత్మక తప్పిదం 370, 35ఏ చట్టమని దాన్ని రద్దు చేస్తే అక్కడ ప్రాంతం పూర్తిగా దేశం పరిధిలోకి వస్తుందని గుర్తించి ప్రధాని మోదీ రద్దు చేసారని వివరించారు. ఈ చట్టం రద్దుతో సంపూర్ణ భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినట్లయిందని, అయితే దాన్ని విపక్షాలు జీర్ణించుకోవడం లేదని ఆరోపించారు.
ఎంపీ బెల్లాన వినతి
విభజన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాలలో ఆదుకోవాలని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ కోరారు. సభకు హాజరైన ఆయన మాట్లాడుతూ కేంద్ర మంత్రి సహాయన్ని కోరారు. ప్రత్యేక హోదా హక్కును అమలు చేయాలని కోరారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయనకు జ్ఞాపికను అందజేశారు. అనంతరం సంపర్క అభియాన్ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ముగ్గురు ప్రముఖుల ఇళ్లకు కేంద్రమంత్రి వెళ్లి దేశ పరిస్థితులపై చర్చించారు. చెవికి సంబంధించిన వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మిషన్‌లను అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ ప్రధాన కార్యదర్శి సూకల మధుకర్‌జీ, మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బవిరెడ్డి శివప్రసాద్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పెద్దింటి జగన్మోహనరావు, ప్రధాన కార్యదర్శి సత్తి అచ్చిరెడ్డి, జిల్లా, నియోజకవర్గ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment