నెల్లిమర్ల: జిల్లా కేంద్రమైన విజయనగరానికి కూత వేటు దూరంలో చుట్టూ పచ్చని కొండలు..దగ్గర్లోనే నది..సమీపంలోనే వెయ్యేళ్ల క్రితం నిర్మించిన జైన దేవాలయం వీటి మధ్యలో 25 హెక్టార్ల సువిశాలమైన అటవీ ప్రాంతం. ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న నగరవనం సందర్శకుల అందమైన కలలకు మరో రూపం కానుంది. అందమైన నగరవనంలోకి త్వరలోనే సందర్శకులను అనుమతించడానికి సంబంధిత అధికారులు వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఇక్కడ ఇప్పటికే రూ 42 లక్షలతో చిల్డ్రన్ పార్క్, వైల్డ్ లైఫ్ సెంటర్, వాకింగ్ ట్రాక్, రాశి వనం ఏర్పాటుచేశారు. సమీపంలో ఉన్న కొండపైకి ట్రెక్కింగ్ పాత్, సైకిల్ పార్క్, ఓపెన్ ఆడిటోరియం, కాలువ పార్క్ అందుబాటులోకి తీసుకురానున్నారు.
నగర వనానికి ప్రహరీ నిర్మించి, రక్షణ కల్పించనున్నారు. నెల్లిమర్ల పట్టణానికి విచ్చేసే ప్రధాన రహదారి నుంచి నెల్లిమర్ల పారిశ్రామిక వాడకు వెళ్లే రహదారిలో సారిపల్లి సెంట్రల్ నర్సరీ ఉంది. ఈ నర్సరీలో నగర వనం ఏర్పాటు చేయాలని 2015లో అటవీశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే అప్పటి టీడీపీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిధులు మంజూరు చేయకపోవడంతో ఇప్పటికీ పనులు పూర్తికాక, ప్రారంభానికి నోచుకోని దుస్థితి నెలకొంది.
ఈ నేపథ్యంలో ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చొరవ తీసుకుని నగర వనాన్ని ప్రారంభించాలని, సందర్శకులకు అందుబాటులోకి తీసుకురావాలని సంకల్పించింది. దీని కొసం అవసరమైన చర్యలు చేపట్టాలని తాజాగా అటవీశాఖ అధికారులకు కలెక్టర్ ఎ. సూర్యకుమారి ఆదేశాలు జారీచేశారు. దీంతో డీఎఫ్‌ఓ శంబంగి వెంకటేష్ తాజాగా నగర వనాన్ని సందర్శించారు. ఇంకా అవసరమైన ఏర్పాట్లు, సౌకర్యాలను కల్పించి వచ్చే ఏడాది వేసవి ప్రారంభానికి సందర్శకులను అనుమతించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. నగర వనం ద్వారా జిల్లా వాసులకు ఆహ్లాదంతో పాటు ఆరోగ్యాన్ని అందించడమే లక్ష్యమని చెబుతున్నారు.
వచ్చే ఏడాది అందుబాటులోకి
సారిపల్లి సెంట్రల్ నర్సరీలో ఏర్పాటుచేస్తున్న నగర వనాన్ని వచ్చే ఏడాది సందర్శకులకు అందుబాటులోకి తీసుకొస్తాం. 25 హెక్టార్ల సువిశాలమైన ప్రదేశంలో ఇప్పటికే రూ.42 లక్షలతో పలు సౌకర్యాలు, ఏర్పాట్లు పూర్తిచేశాం. ప్రహరీ, ఆర్చ్ నిర్మిస్తాం. అలాగే ఓపెన్ ఆడిటోరియం, ట్రెక్కింగ్ పాత్, కాలువ, పార్క్ తదితరాలను ఏర్పాటు చేయడానికి చర్యలు చేపడతాం. సందర్శకులకు ఆహ్లాదంతో పాటు ఆరోగ్యం అందించడమే నగర వనం లక్ష్యం.
శంబంగి వెంకటేష్, డీఎఫ్‌ఓ, విజయనగరం
(చదవండి: డబుల్ ధమాకా ఆఫర్! 15 వేలు ఇస్తే ప్రమోషన్...కోరిన చోట పోస్టింగ్)
Comments
Please login to add a commentAdd a comment