
శ్రీకాకుళం,పాలకొండ: ప్రజాసంకల్ప పాదయాత్రలో భాగంగా వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 28న పాలకొండలో నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. శుక్రవారం పాలకొండలో పర్యటించి సభ ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులకు పలు సూచనలు అందించారు. జూనియన్ కళాశాల నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ మధ్యలో సభ ఏర్పాట్లు చేస్తున్నామని పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలవల విక్రాంత్ వివరించారు.
దీనిపై ఆయన స్పందిస్తూ ప్రజలు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. వడమ రహదారి కూడలి వరకూ పాదయాత్ర నిర్వహించిన అనంతరం బహిరంగ సభ నిర్వహిస్తారని తెలిపారు. 29న అన్నవరం నుంచి పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. పార్టీ శ్రీకాకుళం పార్లమెంటరీ అధ్యక్షుడు తమ్మినేని సీతారాం, పాలకొండ, రాజాం ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, కంబాల జోగులు సభ ఏర్పాట్లు పరిశీలించారు. వీరితో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.