
విజయవాడలో రియల్టర్ ఆత్మహత్య
నూజివీడులో భూములు కొని నష్టపోయిన వ్యాపారి
రాజధాని అక్కడే వస్తుందని నమ్మి అప్పులు చేసి కొనుగోళ్లు
వడ్డీ వ్యాపారులు ఒత్తిడి పెంచడంతో బలవన్మరణం
విజయవాడ: రాజధాని నిర్మాణం కృష్ణా జిల్లా నూజివీడు ప్రాంతంలోనే జరుగుతుందని నమ్మి ఆ ప్రాంతంలో భూములు కొని నష్టపోయిన రియల్ ఎస్టేట్ వ్యాపారి పుప్పాల విజయ్‌కుమార్.. సోమవారం మధ్యాహ్నం బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాజధాని గుంటూరు జిల్లా తుళ్లూరుకు వెళ్లడంతో విజయ్ కుమార్ పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయాడని, వడ్డీ వ్యాపారుల ఒత్తిడి చేయడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని విజయ్‌కుమార్ బంధువులు ఆరోపిస్తున్నారు. రాజధాని నిర్మాణంపై గతంలో ప్రభుత్వం పలు ప్రకటనలు చేయడంతో.. విజయవాడలోని రామవరప్పాడులో నివాసి విజయ్‌కుమార్ నూజివీడులో స్థలాలు కొన్నాడు. దాని కోసం తనకు గన్నవరం సమీపంలోని తేలప్రోలు వద్దనున్న 36 సెంట్ల స్థలాన్ని అమ్మాడు. ఆ సమయంలో పొరుగు స్థలం వారితో వివాదం ఏర్పడినట్లు సమాచారం.
సొంత స్థలం అమ్మిన పైకంతో పాటు.. అధిక వడ్డీలకు మరో రూ. కోటి వరకూ అప్పుచేసి మొత్తం రూ. 5 కోట్లతో నూజివీడులో స్థలాలను కొనుగోలు చేశాడు. వాటిలో కొన్నింటికి అడ్వాన్స్‌లు మాత్రమే చెల్లించాడు. కొన్ని రిజిస్ట్రేషన్‌లు చేయగా, కొన్ని రిజిస్ట్రేషన్ కాలేదు. స్థలాలు వెంటనే అమ్ముడుబోతే వారికి పూర్తిగా డబ్బు చెల్లించాలని నిర్ణయించుకున్నాడు. స్థలాలు అమ్మకాలు జరగకపోవడంతో తాను కొన్న భూములకు మిగిలిన డబ్బులు వెంటనే చెల్లించలేకపోయాడు. కాగా, సాయిరామ్ అనే ఫైనాన్షియర్ వద్ద రూ. 3 వడ్డీకి రూ. 40 లక్షలు అప్పు తీసుకున్నాడు. దానిపై నెలకు రూ. 1.20 లక్షల వడ్డీ చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నాడు. ఐదు నెలల నుంచి ఫైనాన్షియర్స్ నుంచి ఒత్తిళ్లు మొదలయ్యాయి. ఈ నెల 9వ తేదీ వచ్చినా వడ్డీ చెల్లించకపోవడంతో వడ్డీ వ్యాపారి వద్ద నుంచి సోమవారం ఉదయం 10.23 గంటలకు ఫోన్ వచ్చింది. దీంతో విజయకుమార్ వణికిపోయాడు.
భార్యను బయటకు పంపి..: అప్పుడే రామవరప్పాడులోని స్కూల్లో చదువుతున్న ఇద్దరు ఆడపిల్లలకు భోజనం క్యారియర్ ఇచ్చేందుకు భార్య బయలుదేరింది. ఆమెతో ఫోన్ విషయాన్ని వివరించి బాధపడ్డాడు. భార్య బయటకు వెళ్లగానే ఇంట్లో ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీ వద్ద విజయ్ కుటుంబ సభ్యులు, బంధువులు మాట్లాడుతూ.. అప్పులిచ్చినవారి ఒత్తిళ్ల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపించారు. అప్పుల కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాశాడని, దాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించడం లేదు.