ఎంత పనిచేశావమ్మా..
బాలాయపల్లి: ప్రేమాభిమానాలు, ఆత్మీయ అనురాగాలతో అన్యోన్యంగా సాగుతున్న ఆ కాపురంలో ఆర్థిక సమస్యలు చిచ్చురేపాయి. ఆరోగ్య సమస్యలు మరింత కష్టాలు తెచ్చాయి. కుటుంబానికి భారం కాకూడదని భావించిన ఆ తల్లి క్షణికావేశంలో తీవ్ర నిర్ణయం తీసుకుంది. తాను ఒంటరిగా వెళ్లిపోతే బిడ్డలు దిక్కులేని వారవుతారని భావించినట్టుంది. ముక్కుపచ్చలారని ఆ చిన్నారులను తన వెంట కానరాని లోకాలకు తీసుకెళ్లిపోయింది. వింటేనే కన్నీరు వస్తున్న ఈ ఘటన బాలాయపల్లిలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. విగతజీవులుగా మారిన తాళ్లూరు సుజాత(30), జోషిక(11), సాకేష్ అలియాస్ వాసు (9)ను చూసి అందరూ కన్నీరుమున్నీరయ్యారు.
పోలీసుల కథనం మేరకు..బాలాయపల్లికి చెందిన తాళ్లూరు ప్రసాద్‌కు సైదాపురం మండలం గంగదేవిపల్లికి చెందిన సుజాతతో పదిహేనేళ్ల కిందట వివాహమైంది. వీరి పిల్లలు జోషిక వెంకటగిరిలోని ఓ ప్రైవేటు స్కూలులో ఏడో తరగతి, సాకేష్ నాలుగో తరగతి చదువుతున్నారు. ప్రసాద్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల ప్రసాద్ తల్లి ఇందిరమ్మ ఆత్మహత్యాయత్నం చేయడంతో ఆమెకు చికిత్స కోసం రూ.2 లక్షలు ఖర్చుపెట్టారు. మరోవైపు కొద్దిరోజులుగా సుజాత కడుపునొప్పితో బాధపడుతోంది. భర్త సంపాదన అంతంతమాత్రంగా ఉండటంతో ఆర్థిక ఇబ్బందులతో పాటు తన అనారోగ్య సమస్య తోడవడంతో సుజాత మనస్థాపానికి గురైంది. ఇక కుటుంబానికి భారం కాకూడదని భావించింది.
ఈ క్రమంలోనే మూడు రోజుల క్రితం భర్త ప్రసాద్‌తో పాటు అత్త ఇందిరమ్మ, గ్రామంలోని బంధువులు ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు పుత్తూరు వెళ్లారు. తనతో పాటు జోషికను ప్రసాద్ తీసుకెళతానన్నా సుజాత నిరాకరించింది. తమ చావుకు ఎవరూ కారణం కాదని, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఇంటికి భారం కాకూడదని ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాసి ఇంట్లో గోడకు అంటించింది. సోమవారం తెల్లవారుజామున 4.30 గంటలకే నిద్రలేచి ఉండటంతో స్కూలుకు వెళ్లేందుకు పిల్లలను రెడీ చేస్తోందని ప్రసాద్ తండ్రి రాజయ్య భావించాడు.
కాసేపటి తర్వాత బిడ్డలతో సహా వెళ్లి ఇంటికి సమీపంలోని బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఇంతలో పుత్తూరు వెళ్లిన సమీప బంధువు పార్వతి 5 గంటలకు గ్రామానికి వచ్చి సుజాత ఇంటికి చేరుకుంది. ఎవరూ కనిపించకపోవడంతో రాజయ్యను అడగ్గా ఇంట్లోనే ఉన్నట్టున్నారని సమాధానమిచ్చాడు. లోపల చూడగా గోడకు సూసైట్ నోట్ కనిపించడంతో బంధుమిత్రులు, ఇంతలో ఇంటికి వచ్చిన భర్త ప్రసాద్ అందరూ ఆందోళనకు గురై గాలించసాగారు. పోలీసు క్వార్టర్స్ ఆవరణలోని బావిలో ఉదయం 7.30 గంటల సమయంలో తల్లీబిడ్డల మృతదేహాలను గుర్తించి అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు.
అందరి కంటా కన్నీరే..
గ్రామంలో అందరితో ఎంతో బాగుండే సుజాతతో పాటు ఆమె పిల్లలు బావిలో విగతజీవులుగా కనిపించడంతో గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. ఎంత పనిచేశావమ్మా..అంటూ బోరున విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. సుమారు మూడు గంటలపాటు శ్రమించి తల్లీబిడ్డల మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాలకు స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ నివాళులర్పించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వపరంగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. గూడూరు డీఎస్పీ శ్రీనివాస్, వెంకటగిరి సీఐ నరసింహరావు, బాలాయపల్లి ఎస్సై శ్రీహరిబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వెంకటగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.