3 ముళ్ల తంతుకు..4నెలల విరామం | Sukra Maudhyami stat in Thursday | Sakshi
Sakshi News home page

3 ముళ్ల తంతుకు..4నెలల విరామం

Published Wed, Apr 27 2016 1:02 AM | Last Updated on Sun, Sep 3 2017 10:49 PM

3 ముళ్ల తంతుకు..4నెలల విరామం

3 ముళ్ల తంతుకు..4నెలల విరామం

నేటి ఉదయం 10.28 ముహూర్తమే చివరిది!
  జూలై 13 వరకూ శుక్ర మౌఢ్యమి
   ఆగస్టు నాలుగు నుంచే మరలా పెళ్లి బాజా మోగేది...
   ఈ వివాహాల సీజన్‌లో రత్నగిరిపై ఒక్కటైన 1500 జంటలు
   దేవస్థానానికి రూ.రెండు కోట్లకుపైగా ఆదాయం

 
 బాజాభజంత్రీల మోతలతో.. వధూవరులు, వారి బంధువుల సందడితో కళకళలాడిన రత్నగిరి సత్యదేవుని సన్నిధిలో పెళ్లిసందడికి బుధవారం ఉదయం 10.28 గంటల ముహూర్తంతో బ్రేక్‌పడనుంది. 29న కొంతమంది పండితులు వివాహాలకు ముహూర్తాలు నిర్ణయించినా, బుధవారం జరిగేదే పెద్ద ఆఖరి వివాహ ముహూర్తమని అత్యధిక పండితుల అభిప్రాయం. ఈ నెల 30 నుంచి శుక్ర మౌఢ్యమి ప్రారంభమై.. జూలై 13న ముగుస్తుంది. మూఢమిలో వివాహాది శుభకార్యాలు జరగవు. అందువల్ల మరలా రత్నగిరిపై పెళ్లిబాజా మోగాలంటే శ్రావణమాసం అంటే నాలుగునెలల వరకూ ఆగాల్సిందేమరి!
 - అన్నవరం
 
 మూఢంతో వివాహాలకు పనికిరాని ‘వైశాఖం’
 సాధారణంగా అన్నవరం దేవస్థానాలలో వివాహాలకు వైశాఖ మాసం పెట్టింది పేరు. ఆ నె లలోనే సత్యదేవుడు, అమ్మవార్ల దివ్యకల్యాణ మహోత్సవాలు జరుగుతాయి. అందువలన ప్రధానంగా ఉభయగోదావరి జిల్లాలోని వారు వైశాఖ మాసంలోనే వివాహాలకు ముహూర్తాలు పెట్టుకుంటారు. అటువంటిది ఈ సారి వైశాఖ మాసం(మే ఏడో తేదీ నుంచి జూన్ ఐదోతేదీ వరకూ) మూఢం కారణంగా వివాహాది శుభకార్యాలకు పనికిరానిదైంది. వైశాఖం కంటే ముందుగా అంటే ఏప్రిల్ 30వ తేదీ నుంచి మూఢం వస్తుండడంతో అందరూ చైత్రమాసం అంటే ఏప్రిల్‌లోనే వివాహ ముహూర్తాలు పెట్టుకున్నారు.
 
 వేలాదిగా వివాహాలు...
 ఏప్రిల్ నెలలో ఉభయగోదావరి జిల్లాల్లో ఎక్కడ చూసినా పెళ్లిసందడే. దివ్యమైన ముహూర్తాలు 20, 21, 22, 24, 26తేదీల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి.  ఈ ముహూర్తాల్లో అన్నవరం దేవస్థానంలో సుమారు 1500 జంటలు ఒక్కటయ్యాయి.
 
 కిక్కిరిసిన సత్యదేవుని ఆలయం
 సత్యదేవుని దర్శనార్థం విచ్చేసిన భక్తులకు తోడు, పెళ్లిజనంతో ఆలయం కిక్కిరిసింది. అయితే వివాహాలన్నీ రాత్రి 11-45 గంటలు, పగలు 10-30 గంటలవి కావడంతో వివాహబృందాల్లో చాలామంది పెళ్లి అనంతరం తిరిగి స్వస్థలాలకు వెళ్లిపోయారు. దీనికి తోడు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి స్వామివారి వ్రతాల నిర్వహణ, దర్శనాలు నిర్వహించడంతో భక్తులు ఇబ్బంది పడకుండానే అన్నీ సవ్యంగా జరిగిపోయాయి.
 
 దేవస్థానానికి దండిగా ఆదాయం
 ఈ నెలలో జరిగిన వివాహాల ద్వారా దేవస్థానానికి సుమారు రూ.రెండు కోట్లు పైగా ఆదాయం వచ్చిందని అధికారుల అంచనా. ఈనెల 29న సత్యదేవుని హుండీలను లెక్కించనున్నారు. హుండీల ద్వారా రూ.కోటిన్నర నుంచి రూ.రెండు కోట్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు. మొత్తం మీద చైత్రమాస పెళ్లిళ్లు సత్యదేవునికి కూడా మంచి ఆదాయాన్ని తెచ్చాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement