నిడమర్రు: వేసవి కాలం వచ్చిందంటే.. పిల్లల్లో చెప్పలేని ఉత్సాహం. ఒంటి పూట బడుల కారణంగా సమయం ముగిసిందంటే మధ్యాహ్నం ఆటపాటల్లో విద్యార్థులంతా సరదాగా గడిపేందుకే ఉత్సాహం చూపిస్తుంటారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు చెరువులు, కాలువలు, వ్యవసాయ బావుల్లో ఈత కొడుతూ ఎండ వేడిమి నుంచి ఉపసమయం పొందుతుంటారు. ఆటలు, ఈత శారీరక వ్యాయామంగా మంచిదే అయినప్పటికీ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సరదామాటున ప్రమాదాలు పొంచి ఉంటాయని తల్లిదండ్రులు గుర్తించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉష్ణతాపం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పిల్లలకు అవగాహన కల్పించాలని వైద్యులు చెపుతున్నారు. ఒంటి పూట బడులు వచ్చే నెల 23వ తేదీ వరకూ కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో చిన్నారుల సంరక్షణలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం..
మధ్యాహ్నం సూర్యరశ్మికిరణాలతో ప్రమాదం
ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సూర్య కిరణాలు నిటారుగా భూమిపై పడతాయి. ఆసమయంలో ఎక్కువగా బయట తిరిగితే అతినీలలోహిత కిరణాలు నేరుగా చర్మంపై పడి చర్మాన్ని దెబ్బతీస్తాయి. మరో వైపు అంతర్గతంగా కూడా ఈ కిరణాల ప్రభావం ఉంటుందని వైద్యులు చెపుతున్నారు.
ఒంటి పూట బడి అవగానే ఇంటికి వచ్చిన పిల్లలను తప్పనిసరిగా అయితే తప్ప ఎండపూట బయటకు వెళ్లనివ్వకూడదు.
చిన్నారుల విషయంలో ఇలా
♦ చిన్నపిల్లలను పాఠశాల నుంచి ఇంటికి తీసుకువచ్చే సమయంలో గొడుగు వాడాలి.
♦ ప్రయాణాల సమయంలో ద్విచక్ర వాహనంపై పిల్లలను మధ్యాహ్నం పూట ముందు భాగంలో కూర్చోపెట్టుకుంటే వడ గాలులు నేరుగా తగిలి వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. వారిని వెనుక కూర్చోబెట్టుకోవాలి
♦ పిల్లలు తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సివస్తే టోపీ పెట్టుకునేలా ప్రోత్సహించాలి. తల, ముఖభాగం పూర్తిగా కప్పి ఉంచేలా వస్త్రం కట్టుకుంటే ఇంకా మంచిది.
బోర్ ఫీలవకుండా
ఇంట్లో ఖాళీగా ఉంటే పిల్లలు బోర్‌గా ఫీలయ్యే అవకాశం ఉన్నందున వారికి కొత్త ఆటలు గాని విజ్ఞానాన్ని పంచే అంశాలపై దృష్టి సారించేలా చూడాలి. వీలైనంత మేర తల్లిదండ్రులు తమ పిల్లలతో గడిపేందుకు ప్రయత్నించాలి. పాఠశాలల్లో ఇచ్చిన హోమ్‌వర్క్ మధ్యాహ్నం చేసుకునేలా విద్యార్థులను ప్రోత్సహించాలి. దీని ద్వారా సాయంత్రం ఎండ తగ్గిన తర్వాత అడుకునే వెసులుబాటు కలుగుతుంది. వేసవి తాపం కారణంగా పిల్లలు తొందరగా అలిసిపోయే అవకాశం ఉన్నందున మధ్యాహ్నం కొంత సమయం విశ్రాంతి తీసుకునేలా చూడాలి.
స్నేహితుల విషయంలో
ఒంటి పూట బడుల కారణంగా బడికి వెళ్లే పిల్లలు మధ్యాహ్నం ఖాళీగా ఉండటం ఇష్టం లేక వీలైనంద వరకు తోటి స్నేహితులతో సరదాగా కాలం గడపాలని చూస్తారు. పిల్లలకు వేసవిలో కలిగే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం ఒంటిపూట బడులు నిర్వహిస్తుందని గమనించాలి. నిర్లక్ష్యం చేస్తే తెలిసీ తెలియని వయస్సులో ఉన్న పిల్లల ఆరోగ్యంతోపాటు వారి ప్రాణాలపై ప్రభావం పడుతుందనే విషయం తల్లిదండ్రులు గమనించాలి.
వేసవిలో సేదతీరేందుకు
వేసవి తాపాన్ని తట్టుకోవడం కోసం మధ్యాహ్నం పూట పిల్లలు చెరువులు, పంట కాలువలు, వ్యవసాయ బోరు బావుల్లో ఈతకని వెళ్లి ప్రమాదాలు బారిన పడిన విషాధకర సంఘటనలు ఏటా ఎన్నో జరుగుతున్నాయి. ఈత నేర్చుకకోవడం మంచిదే అయినప్పటికీ పెద్దలు, అనుభవజ్ఞుల సమక్షంలో చేసే ఫలితం ఉంటుందని తల్లిదండ్రులు గమనించాలి.
పెద్దల సమక్షంలో శిక్షణ
సైకిల్ తొక్కడం, ద్విచక్రవాహనాలు నడపడం నేర్చుకోవాలన్న కోరిక పిల్లల్లో సహజంగానే ఉంటుంది. వారి వయస్సు ఆధారంగా సైకిల్‌గాని, ద్విచక్రవాహనం నడిపేందుకు శిక్షణ తోటి మిత్రుల ఆధ్వర్యంలో కాకుండా పెద్దలు సమక్షంలో జనం సంచారం లేని చోట జరిగేలా చిన్నారులకు కౌన్సిలింగ్ ఇవ్వాలి. సెలవుల్లో కొత్త స్నేహాలకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. పి
ల్లల స్నేహితులు ఎవరో, వారు ఎక్కడికి వెళ్తున్నారో ఎప్పటికప్పుడు గమనించాలి. వారు ఎక్కడికి ఎందుకు వెళుతున్నారో పక్కా సమాచారం తల్లిదండ్రుల వద్ద ఉండేలా బాధ్యత వహించాలి.
ఆరోగ్యంపై ఉష్ణోగ్రతల ప్రభావం
వేసవిలో సాధ్యమైనంత వరకు పిల్లలను మధ్యాహ్నం పూట ఎండలోకి వెళ్లకుండా తల్లిదుండ్రులు చర్యలు తీసుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సివస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వడదెబ్బ తగలకుండా బయటకు వెళ్లే సమయంలో ఎక్కువ నీరు తాగాలి. శీతల పానియాల బదులు కొబ్బరి బొండాం, పండ్ల రసాలు తీసుకోవాలి. వడ దెబ్బతగిలితే ఓఆర్‌ఎస్ తాగించాలి. దగ్గరలో ఉన్న పీహెచ్‌సీకి తీసుకు వెళ్లి వైద్యం అందించాలి.– డాక్టర్ కె. శంకరరావు పిల్లల వైద్యనిపుణుడు, జిల్లా అసుపత్రుల సమన్వయ అధికారి
Comments
Please login to add a commentAdd a comment