చోరీ జరిగిన ఇంట్లో చిందరవందరైన వస్తువులు(ఫైల్)
అసలే వేసవి కాలం.. ఆపై సెలవులు వచ్చేశాయి. ఇంకేముంది విహారయాత్రలే..! ఇలా అనుకుంటే సరిపోదు. ఇల్లు వదిలి వెళ్లే సమయంలో పలు జాగ్రత్తలు పాటిస్తే చోరీల నుంచి కాపాడుకోవచ్చు. ఇరుగుపొరుగు వారికో, పోలీసులకో సమాచారం ఇవ్వాలి. అలా చేయకుంటే ఇంటికొచ్చేసరికి ఇంకేముంది ఇల్లు గుల్లే..!! ఆధునిక సీసీ కెమెరాలు, అలారం ఏర్పాటు చేసుకుంటే కొంతైనా రక్షణ ఉంటుంది. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని పోలీసు యంత్రాంగం కూడా కోరుతూనే ఉంది.
మద్నూర్(జుక్కల్) : ఇప్పటికే టెన్త్, ఇంటర్ పరీక్షలు ముగిశాయి. ఇక పిల్లాపాపలతో ఊరెళ్తాం అనుకొని ఇంటికి తాళం వేసి ఇతర ప్రాంతాలకు వెళ్తారు. హాయిగా అన్నీ చూసి వచ్చేసరికి ఇంట్లో దుండగులు పడి ఉన్నదంతా దోచుకుపోతారు. లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తారు. ఇది రోటీన్. ప్రతి ఏటా ఇలాంటి సంఘటనలు చాలానే చూస్తాం, వింటాం. తాళాలు వేసి ఉన్న ఇళ్లు పరిశీలించి యజమానులు ఉండరనుకునే దుండగులు ఆయా ఇళ్లలో నేరాలకు పాల్పడుతుంటారు. అందుకే వేసవిలో ఊరేళ్లాలంటేనే కొందరు హడలెత్తుతారు.
అవగాహన అవసరం..
ఇల్లు విడిచి వెళ్లేటప్పుడు తీసుకోవాలసిన కనీస జాగ్రత్తలు పాటిస్తే చోరీల నుంచి కాపాడుకోవచ్చు. ఇంటికి తాళం వేయడంతో పాటు పక్కనే ఉన్న ఇంటివారికి తాము ఎన్ని రోజులు రాలేరో తెలియజేయాలి. ఎప్పటికప్పుడు ఇంటిని గమనించాలని కోరాలి. అవసరమైతే వారికి తమ ఫోన్ నంబర్ ఇవ్వాలి. అలాగే సమీప పోలీస్‌స్టేషన్‌కు తాము ఊరు వెళ్తున్నట్టు సమాచారం ఇవ్వాలి. తద్వారా పోలీసులు ఆ ఇంటికి ప్రతి రోజు బీట్ కానిస్టేబుళ్లను పంపుతారు. ఇలా అవగాహన కలిగి ఉంటే ప్రయాణాలు ఎక్కడికైనా చేయవచ్చు.
భరోసా కరువు..
ఊరెళ్లేవారి పరిస్థితి ఇలా ఉంటే వేసవిలో ఇంట్లో వేడి కారణంగా ఆరుబయట నిద్రించేవారి పరిస్థితి మరో విధంగా ఉంటుంది. దుండగులు దీన్ని అదనుగా తీసుకుని ఇళ్లలోకి ప్రవేశించి దోపిడీ చేసేస్తారు. అలికిడి వచ్చి ఎవరైనా మేలుకుంటే వారిపై దాడికి పాల్పడుతారు. ఇలాంటిప్పుడు రక్షణకు భరోసా కరువు అవుతుంది. ఇక్కడ కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఇంట్లో ఉక్కపోత ఎక్కువగా ఉంటే ఇంటికి తాళం వేసి బయట పడుకోవాలే కాని తలుపులు దగ్గరికి వేసి నిద్రకు ఉపక్రమిస్తే అంతే సంగతులు. అలాగే దుండగులు ప్రవేశిస్తే వారిని ప్రతిఘటించే ప్రయత్నం చేయాలి. గట్టిగా కేకలు వేయడం ద్వారా కాపాడేందుకు రావాలని ప్రజలను కోరాలి. ఏ సెల్‌నుంచైనా 100కు ఫోన్ చేసి పరిస్థితి వివరించాలి. త్వరగా పోలీసులు అక్కడికి చేరే అవకాశం ఉంటుంది.
ఇంట్లో అలారం ఏర్పాట్లు..
ఇతర గ్రామాలకు వెళ్లేవారు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు లాక్ అలారం అందుబాటులోకి వచ్చింది. ఇంట్లో తాళం వేసిన అనంతరం ఈ అలారం ఏర్పాటు చేస్తే ఎవరైనా లోపలికి ప్రవేశిస్తే అలారం వెలుగుతుంది. దీని ద్వారా సమీపంలోని ప్రజలు గుర్తించి అక్కడికి చేరే అవకాశం ఉంటుంది. అలాగే నైట్ మోడ్ వీడియో సీసీ కేమెరాలు మార్కెట్‌లో లభిస్తున్నాయి. అవి ఏర్పాటు చేస్తే నేరం జరిగిన తీరు తెలియడమే కాకుండా పోలీసులకు దుండగులను త్వరగా పట్టుకునే వీలుంటుంది.
అప్రమత్తంగా ఉండాలి..
చోరీలు కాకుండా ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలి. వేరే గ్రామాలకు వెళ్తేవారు వారి ఇంటి చిరునామా, ఫోన్‌నంబర్లు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అందించాలి. ప్రతిరోజు ఆయా ఇళ్లవద్ద గస్తీ ఏర్పాటు చేస్తం. అనుమానితులు, అపరిచితులు తారసపడితే వెంటనే ప్రశ్నించాలి. అనుమానం వస్తే పోలీసులకు సమాచారమివ్వాలి. అప్రమత్తతతో నేరాలు అదుపులోకి వస్తాయి. ప్రజల సహకారంతోనే శాంతిభద్రతలు పరిరక్షించగలుగుతాం. ఈ వేసవిలో చోరీలు కాకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం.
–మహమ్మద్ సాజిద్, ఎస్‌ఐ, మద్నూర్
Comments
Please login to add a commentAdd a comment