బడికి బైబై
బడికి బైబై
Published Sat, Apr 22 2017 11:58 PM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
- నేటి నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు
- జూన్ 12న పునఃప్రారంభం
- సెలవు రోజుల్లో స్కూళ్లు నిర్వహిస్తే కఠిన చర్యలు
- నేటికీ పూర్తికాని ముల్యాంకన ప్రక్రియ
- విద్యార్థులకు అందని ప్రోగ్రెస్ రిపోర్ట్‌లు
కర్నూలు సిటీ: అన్ని యాజమాన్యాల పరిధిలోని స్కూళ్లకు నేటి నుంచి వేసవి సెలవులు ప్రకటించారు. ఏటా ఏప్రిల్ 23వరకు స్కూళ్లు పని చేసి 24 నుంచి జూన్ 11వ తేదీ వరకు సెలవులు ఇచ్చేవారు. అయితే ఈ ఏడాది 23వ తేదీ ఆదివారం కావడంతో శనివారమే స్కూళ్లకు చివరి పనిదినమైంది. ప్రయివేటు స్కూల్స్ యాజమాన్యాలు సెలవురోజుల్లో తరగతులు నిర్వహిస్తే చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు హెచ్చరించారు. తిరిగి జూన్ 12వ తేదీ స్కూళ్లను పునఃప్రారంభించనున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది ముందుగానే సమ్మేటివ్-3 పరీక్షలు నిర్వహించారు. ఆ తరువాత పై తరగతికి సన్నద్దులను చేసేందుకు సవరణాత్మక బోధన చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే విద్యార్థులకుగానీ, టీచర్లకుగానీ ఎలాంటి పుస్తకాలు ఇవ్వకపోవడంతో పాత పాఠ్య పుస్తకాల్లోని అంశాలనే బోధించారు. అలాగే స్కూళ్లకు సెలవులు ప్రకటించే నాటికే ముల్యాంకనాన్ని పూర్తి చేసి, చివరి పనిదినాన విద్యార్థులకు ప్రోగ్రెస్ రిపోర్ట్‌లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు ముల్యాంకనమే పూర్తికాకపోవడం గమనార్హం. దీనికి తోడు ఈ ఏడాది నుంచి విద్యార్థుల మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంది. ముల్యాంకనం పూర్తికాకుండా స్కూళ్లకు సెలవులు ఇవ్వడంతో ఆన్‌లైన్ నమోదు ఎలా చేయాలో అర్థంకాక హెచ్‌ఎంలు తలలు పట్టుకుంటున్నారు.
Advertisement