మండే ఎండ
- 40.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
- ఉక్కపోతతో అల్లాడుతున్న జనం
- పెరుగుతున్న వడగాలులు
సాక్షి, విశాఖపట్నం : ఎండ.. ఉక్కబోత.. వడగాలులు.. కరెంట్ కోత మూకుమ్మడిగా నగరవాసిపై దాడి చేస్తున్నాయి. దీంతో జనాలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గతంలో ఎన్న డూ లేనంతగా.. దాహంతో గొంతు తడారిపోతోందని గగ్గోలు పెడుతున్నారు. వారం రోజులుగా పరిస్థితులే ఇలా ఉంటే.. రానున్న వేసవిలో మరెంత నరకం చవిచూడాల్సి వస్తుందోనని ఇప్పటి నుంచే భయపడుతున్నారు.
వడగాలులు తీవ్రం : సోమవారం విశాఖ విమానాశ్రయంలో గరిష్ట ఉష్ణోగ్రత 40.6 డిగ్రీలుగా నమోదయినట్టు వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. గత రెండు రోజుల మాదిరిగానే ఉష్ణోగ్రతలున్నప్పటికీ వడగాలులు పెరగడం, గాలిలో తేమ(65 శాతం) కూడా ప్రభావం చూపడంతో ఉక్కబోత, గొంతు పొడిబారడం జరుగుతోందని వెల్లడించారు. రాత్రిపూట కంటే..పగటిపూట వీటి ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు చెప్తున్నారు. కోస్తాంధ్రలో పలు చోట్ల ఇవే పరిస్థితులున్నట్టు వెల్లడించారు.