సూరీడు@ 44.50
మరో నాలుగు రోజులు సెగలే
జిల్లాలో అల్లాడుతున్న జనం
తిరుపతి తుడా: భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. మంగళవారం తిరుపతి లో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఈ ఏడాదిలో ఇదే అత్యధికం. ఈశాన్య వడగాడ్పులతోపాటు బంగా ళాఖాతం నుంచి వేడిగాలులు అధికంగా వీస్తున్నాయి. ఈ నేప«థ్యంలోనే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. పెరిగిన ఎండల వల్ల ఉక్కపోత అధికమయింది. దీంతో మరో నాలుగు రోజుల పాటు ఎండ తీవ్రత ఇలానే ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
తిరుపతి.. చిత్తూరు గంగ జాతర వేడుకల్లో ఎండ ప్రభావం కనిపించింది. మంగళవారం మధ్యాహ్నం వేళ రహదారులన్నీ పలుచగా మారాయి. పాదచారులు మండుటెండల్లో నరకం చూశారు. చిరు వ్యాపారులు ఇంటికే పరిమితమయ్యారు. వడదెబ్బకు జిల్లాలో మంగళవారం ఐదుగురు చనిపోయారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
పెరుగుతున్న ఎండలు, తీవ్ర ఉక్కపోత నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నెల మొదటి వారంలో 38.5 డిగ్రీలకు తగ్గుముఖం పట్టిన ఉష్ణోగ్రతలు 10 రోజుల వ్యవధిలోనే 44.5కు చేరాయి. ద్రోణి కారణంగా తగ్గుముఖంపట్టిన ఎండలు మళ్ళీ తీవ్రరూపం దాల్చాయి. రోజు రోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పదిరోజుల్లోనే ఏకంగా ఆరు డిగ్రీల అధికంగా నమోదైంది. వృద్ధులు, మహిళలు, చిన్న పిల్లలు, గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరోపక్క మునుపెన్నడూ లేనివిధంగా జనం వడదెబ్బ బారిన పడుతున్నారు.