సాక్షి, విశాఖపట్నం/ఖమ్మం: రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదవుతూ ఉండడంతో ప్రజలు అల్లాడుతున్నారు. మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు తారా స్థాయికి చేరుకున్నాయి. వేడి గాలులకుతోడు, కోస్తా జిల్లాల్లో వాతావరణంలో తేమ శాతం పెరిగిపోవడంతో ప్రజలు ఉక్కబోతతో సతమతమవుతున్నారు. వృద్ధులు, చిన్న పిల్లలు వడగాల్పులకు అలమటిం చిపోతున్నారు. శుక్రవారం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా ఖమ్మంజిల్లా కొత్తగూడెంలో 48.4డిగ్రీలు, పాల్వంచలో 47డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే, గుంటూరు జిల్లా రెంటచింతలలో 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే సుమారు 5 డిగ్రీలు వరకు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వెల్లడించింది.
ఆయా ప్రాంతాల్లో వేడి గాలులతోపాటు, అధిక పీడన ప్రభావం కూడా ఉన్నట్టు తెలిపింది. విశాఖపట్నం, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు, ఆదిలాబాద్, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో వేడిగాలుల ప్రభావం తీవ్రంగా ఉండనున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా, ఈ నెలాఖరు వరకూ ఇదే పరిస్థితి ఉంటుందని, ఎండలు పెరిగే అవకాశాలే అధికంగా ఉన్నాయని వాతావరణ నిపుణులు స్పష్టం చేశారు. ఎండ ఎక్కువగా ఉండే సమయాల్లో వీలైనంత వరకూ బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
జాగ్రత్తలు తీసుకోవాలి...
పిల్లలు, వయోవృద్ధులు, గుండెజబ్బు బాధితులు, ఇతర వ్యాధిగ్రస్తులు త్వరగా వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వీరితోపాటు, బీపీ మాత్రలు వాడేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎండ వేడిమి ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు వెళ్లకపోవడం మంచిది.
అధిక మోతాదులో మంచి నీరు తాగాలి. వేడివల్ల చెమట రూపంలో ఎక్కువ నీరు, ఉప్పు బయటకు బయటకు వెళతాయి. డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండడం కోసం ఉప్పు కలిపిన నీరు మధ్య మధ్యలో తాగాలి. శక్తికోసం పండ్లరసాలు, మజ్జిగ, కొబ్బరి నీరు ఎక్కువగా తీసుకోవాలి.
ఎండ సమయాల్లో బయటకు వెళ్లేప్పుడు సాధ్యమైనంతవరకూ తలకు, ముఖానికి వేడి తగలకుండా లేతరంగు వస్త్రాలు కట్టుకోవడం, గొడుగు వాడడం మంచింది. వేడిని ఆకర్షించని లేత రంగు కాటన్ దుస్తులు ధరించాలి.
తలనొప్పి, వాంతులు, వళ్లు నొప్పులు, తీవ్ర నీరసం వడదెబ్బ లక్షణాలు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే రోగికి నాలుగు వైపులా గాలి తగిలే ఏర్పాటు చేసి, తక్షణం వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.