వడ దెబ్బతో 17 మంది మృత్యు వాత
►జిల్లాలో ముదిరిన ఎండలు ప్రజల ప్రాణాలను బలిగొంటున్నాయి. శనివారం ఒక్కరోజే 17 మంది వడదెబ్బతో మృతి చెందారు. పిల్లలు, వృద్ధులు, ఉపాధి కూలీలు ఎండల ధాటికి బెంబేలెత్తుతున్నారు. వడదెబ్బ బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
►ఎర్రగుంట్ల నగర పంచాయతి పరిధిలోని వేంపల్లిరోడ్డులోని దళితవాడకు చెందిన వెంకటసుబ్బయ్య(55) అలియాస్ భద్రయ్య అనే వ్యక్తి వడదెబ్బతో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. మృతుడు తోపుడు బండిపై నిర్వహించే టిఫిన్ సెంటర్‌ల వద్ద కార్మికునిగా పనిచేస్తున్నాడు.
► అక్కా తమ్ముడు..
చిట్వేలి మండల పరిధిలోని కేఎస్ అగ్రహారం సంగాదేవపల్లెలో ఒకే కుటుంబానికి చెందిన సుబ్బమ్మ(85), చేతిపట్టు వెంకటయ్య(75) మృతి చెందారు. వీరిద్దరూ అక్కాతమ్ముడు కావడం గమనార్హం.
►పుల్లంపేట మండల పరిధిలోని కొమ్మనవారిపల్లె గ్రామానికి చెందిన పోలి.చంగల్‌రెడ్డి(90) ఎండతీవ్రతను తట్టుకోలేక మృతి చెందాడు.
పోరుమామిళ్లకు చెందిన దుద్యాల సుబ్బమ్మ(80) అనే వృద్ధురాలు మృతి చెందింది.
►పెనగలూరు మండల పరిధిలోని నల్లపురెడ్డిపల్లె గ్రామానికి చెందిన మహబూబ్‌బీ(70) వడదెబ్బతో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
►కడప నగర శివార్లలోని రామరాజుపల్లెలో పుష్పగిరి గంగమ్మ(68) అనే వృద్ధురాలు వడదెబ్బతో మృతి చెందింది. ప్రతిరోజూ పండ్ల వ్యాపారం చేసి కుటుంబాన్ని పోషించే ఆమె ఇటీవల ఎండలు ఎక్కువ కావడంతో తీవ్ర అనారోగ్యానికి గురై శనివారం మృతిచెందింది.
►ఒంటిమిట్ట మండలం చప్పిటవారిపల్లె గ్రామంలో ఓబులమ్మ(65) ఎండ తీవ్రతను తట్టుకోలేక మృతిచెందింది.
►వేముల మండలం బెస్తవారిపల్లె గ్రామానికి చెందిన నరసింహులు అనే వ్యక్తి వడదెబ్బతో మృతి చెందాడు.
►రైల్వేకోడూరు మండల పరిధిలోని రెడ్డివారిపల్లె గ్రామానికి చెందిన పెంచలమ్మ(50) వడదెబ్బతో మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు.
►రాజంపేట మండలం సీతారామాపురం గ్రామంలో వెలకచెర్ల వెంకటరెడ్డి(60) వడదెబ్బతో మృతి చెందాడు.
►బద్వేలు మండల పరిధిలోని వేర్వేరు గ్రామాలలో శనివారం వడదెబ్బతో ఇద్దరు మృతి చెందారు. మండలంలోని రాజుపాళెం పంచాయతీ అప్పరాజుపేట గ్రామానికి చెందిన బొమ్మిశెట్టి చెన్నమ్మ(62),బోవిళ్లవారిపల్లె గ్రామానికి చెందిన నాగిరెడ్డి అనే వ్యక్తి మృతి చెందిన వారిలో ఉన్నారు.
►బ్రహ్మంగారిమఠం మండలం నరసన్నపల్లె గ్రామంలో జె.అచ్చమ్మ (75)అనే వృద్ధురాలు వడ దెబ్బతో మృతి చెందినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.
►సిద్దవటం మండలం కడపాయపల్లె గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ గాలి రామయ్య (55) వడదెబ్బతో మృతి చెందారు. రామయ్య శుక్రవారం వ్యవసాయ కూలి పనికి వెళ్లారు. ఎండలు ఎక్కువగా ఉండడంతో వడదెబ్బ తగిలిందని కుటుంబీకులు తెలిపారు. ఇదే మండలం జంగాలపల్లె గ్రామం దళితవాడకు చెందిన పాలెం వెంకటలక్షుమ్మ (65) వడదెబ్బతో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.
►రైల్వేకోడూరు పట్టణం పగడాలపల్లెకు చెందిన మర్రిసుబ్బయ్య (70) మృతి చెందినట్లు ఆయన భార్య కృష్ణమ్మ తెలిపింది.
►ముద్దనూరు మండలం ఉప్పలూరు గ్రామంలో తులసి రామిరెడ్డి(65) మృతి చెందాడు.
ప్రాణం తీస్తున్న ఎండలు
Published Sun, May 24 2015 4:47 AM | Last Updated on Sun, Sep 3 2017 2:34 AM
Advertisement
Advertisement