పెరిగిన ఉష్ణోగ్రతలు
వడదెబ్బకు గాలిలో కలుస్తున్న ప్రాణాలు
గుత్తిరూరల్/ శెట్టూరు/ బుక్కరాయసముద్రం/ లేపాక్షి/ యల్లనూరు/ నార్పల/ ఉరవకొండ రూరల్ : జిల్లాలో ఉష్ణోగ్రత తీవ్ర స్థాయిలో ఉంది. వడదెబ్బకు మంగళ,బుధవారాల్లో ఏడుగురు మృత్యువా తపడ్డారు. అనేక మంది ఆస్పత్రులపాలవుతున్నారు.గుత్తి రూరల్ మండలంలోని ఇసురాళ్లపల్లి గ్రామంలో బుధవారం ఎస్.సావిత్రమ్మ(61) వడదెబ్బతో మృతి చెందింది. వ్యవసాయ పొలంలోని పత్తికట్టెను తొలగించేందుకు మంగళవారం వెళ్లింది. ఇంటికి తిరిగివచ్చాక తీవ్ర అస్వస్థతకు గురై తెల్లవారుజామున మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
శెట్టూరు మండల కేంద్రానికి చెందిన భాస్కర్‌రెడ్డి (46) వడదెబ్బతో బుధవారం మృతి చెందారు. హోటల్ నిర్వహించే భాస్కర్‌రెడ్డి రోజు మాదిరిగానే మంగళవారం ఇంటి నుంచి హోటల్‌కు ఎండలో నడిచి వెళ్లారు. తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు మృతి చెందారు. మృతుడికి భార్య రాములమ్మ, కూతురు ఉన్నారు. మృతుడి కుటుంబసభ్యులను కళ్యాణదుర్గానికి చెందిన వైఎస్సార్ సీపీ నేతలు నారాయణరెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ రఘునాథ్‌రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ సోమనాథ్‌రెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శి హనుమంతరాయుడు, సర్పంచ్ రమేష్, నేత హరినాథ్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు కంబాలపల్లి మంజు, రామిరెడ్డి, తహశీల్దార్ వాణీశ్రీ, వీఆర్వోలు పరామర్శించారు.
బుక్కరాయసముద్రం మండలం అమ్మవారిపేటకు చెందిన రాజమ్మ (26) వడదెబ్బకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. రాజమ్మ సోమవారం గ్రామంలో వ్యవసాయ కూలి పనికి వెళ్లింది. సాయంత్ర ఇంటికి వచ్చిన తర్వాత వాంతులు, విరేచనాలు చేసుకుంది. వెంటనే ఆమెను బంధువులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈమెకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు.
లేపాక్షి మండలంలోని కోడిపల్లి గ్రామానికి చెందిన సంజీవమ్మ(45) వడదెబ్బతో మృతి చెం దింది. ఈమె జీవనోపాధి కోసం ఎప్పటిలాగే మంగళవారం కూడా చుట్టు పక్కల గ్రామాలకు గంపలో మామిడి కాయలు తీసుకెళ్లి విక్రయించింది. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత అస్వస్థతకు గురైంది. వెంటనే హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. స్థానిక వీఆర్వో రామాంజినప్ప, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ మురళి మృతురాలి ఇంటివద్దకు వెళ్లి పంచనామా చేశారు.
యల్లనూరు మండలంలోని లింగారెడ్డిపల్లె గ్రామంలో రంగమ్మ(75) వడదెబ్బకు బుధవా రం మృతి చెందింది. ఎండలు తీవ్రంగా ఉండటంతో తట్టుకోలేకపోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. నార్పల మండల కేంద్రంలోని మసీద్ కట్ట కాలనీకి చెందిన పన్నూరు లింగప్ప (55) వడదెబ్బతో మంగళవారం రాత్రి మృతి చెందింది. కూలి పనికి వెళ్లిన వచ్చిన లింగప్ప అస్వస్థతకు గురికావడంతో ఆర్‌ఎంపీ వైద్యుని వద్దకు తీసుకెళ్లారు. చికిత్స అనంతరం ఇంటికి తీసుకొచ్చారు.
నిద్రలోనే ఆయన మృతి చెందారు. రెవెన్యూ, వైద్యశాఖ అధికారులు బుధవారం విచారణ జరిపారు. మృతునికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.ఉరవకొండ రూరల్ పరిధిలోని వైరాంపురం గ్రామానికి చెందిన పరమేశ్వర్(38) బుధవారం వడదెబ్బతో మృతి చెందారు. ఉదయం పొలానికి వెళ్లిన పరమేశ్వర్ మధ్యాహ్నం ఇంటికి వచ్చి వాంతులు చేసుకుని మృతి చెందారు.
ప్రభుత్వాస్పత్రి కిటకిట
తాడిపత్రి టౌన్: మండుతున్న ఎండలకు జనం విలవిల్లాడుతున్నారు. వారం రోజులుగా తాడిపత్రి ప్రాంతం నుంచి రోజు 50 నుంచి 60 మంది రోగులు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం ఆ సంఖ్య 70కు చేరింది. ప్రధానంగా తాడిపత్రి పట్టణంతోపాటు రూరల్, యాడికి, పెద్దపప్పూరు మండలాల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన ప్రజలు వడదెబ్బకు గురై వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిలో చేరుతున్నారు. రోగుల సంఖ్య ఎక్కువగా ఉండటం, మందులు, పడకలు తక్కువగా ఉండటంతో వైద్యులు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు.
ఏడుగురి మృత్యువాత
Published Thu, May 28 2015 3:07 AM | Last Updated on Sun, Sep 3 2017 2:47 AM
Advertisement
Advertisement