సూపర్ ఫాస్ట్
మెట్రోరైలు
వేగంగా కదులుతున్న ఫైలు
డీపీఆర్ రూపకల్పనలో అవాంతరాలపై శ్రీధరన్ అధ్యయనం
నగరంలో విస్తృత పర్యటన
రైల్వేస్టేషన్ నుంచి అలంకార్ వరకు సింగిల్ ట్రాక్
స్వల్ప మార్పులతో మార్చి నాటికి డిజైన్
మెట్రోరైలు ప్రతిపాదన పరుగులు పెడుతోంది. నగరంలో మెట్రో కారిడార్ నిర్మాణానికి ఎటువంటి అవాంతరాలు లేకుండా పక్కా డిజైన్ రూపొందించడంలో ఏపీ మెట్రో ప్రాజెక్టుల సలహాదారు శ్రీధరన్ కసరత్తు మొదలుపెట్టారు. గురువారం నగరంలో పర్యటించిన ఆయన మెట్రో ప్రాజెక్టు వెళ్లే ప్రాంతాలను నిశితంగా గమనించారు. ఏలూరురోడ్డు, బందరు రోడ్డుపై ప్రతిపాదించిన మెట్రో రైల్వే కారిడార్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
విజయవాడ బ్యూరో : నగరంలో మెట్రో కారిడార్ పనులు వేగవంతమయ్యూరుు. పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్, రైల్వేస్టేషన్లను కేంద్రాలుగా చేసుకుని మెట్రో సర్వీస్ తుళ్లూరుకు విస్తరించేలా ముందస్తు ప్రణాళికతో డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్‌ట (డీపీఆర్) తయూరీకి ఏపీ మెట్రో ప్రాజెక్టుల సలహాదారు శ్రీధరన్ కీలక సూచనలు చేశారు. గురువారం ఉదయం ఆయన నగరంలో పర్యటించారు. బస్టాండ్, రైల్వేస్టేషన్‌ల నుంచి రోజూ నగరానికి వచ్చి వెళ్లేవారు 2.50 లక్షల మంది ఉంటారని, వారిలో కనీసం 20శాతం మంది మెట్రో సర్వీసును ఉపయోగించుకున్నా దాని లక్ష్యం నెరవేరుతుందని అభిప్రాయపడ్డారు. మెట్రోరైలు ప్రధాన స్టేషన్ నిర్మించే పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌ను పరిశీలించారు. బస్టాండ్ ప్రాంతం నుంచి గుంటూరు జిల్లాలోని తాడేపల్లికి, కృష్ణానదికి మెట్రో రైల్వేలైను వేసేలా వారధి నిర్మాణానికి తొలిదశలోనే ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. వంతెన నిర్మాణం పూర్తరుుతే భవిష్యత్‌లో రాజధాని తుళ్లూరుకు మెట్రో ప్రాజెక్టును విస్తరించే వీలుంటుందని చెప్పారు. బస్టాండ్ సమీపంలో ఉన్న త్రిశక్తి పీఠం వద్ద మెట్రో రైల్వేలైన్ ఎలైన్‌మెంట్ కొద్దిపాటి మార్పు చేయాలని సూచించారు. అక్కడి నుంచి కనకదుర్గమ్మ వారధికి మెట్రోరైల్‌ను అనుసంధానం చేసేలా డిజైన్ తయారు చేయాలని ఆదేశించారు. బస్టాండ్ ప్రాంతం నుంచి ఏపీ స్టేట్ ఫైర్ సర్వీసెస్ స్టేషన్‌ను, పోలీస్ కంట్రోల్ రూమ్‌లను పరిశీలించిన ఆయన మెట్రో రైల్వే లైన్ ఎలైన్‌మెంట్‌లో మార్పు చేయాలని నిర్ణయించారు. పోలీస్ కంట్రోల్ రూమ్ ప్రాంతంలో ఏలూరు, బందరు రోడ్లు ఒకేచోట కలుస్తున్నందున ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని గుర్తించారు. అక్కడి వరకు ఒకే లైనుగా వచ్చే మెట్రో సర్వీసును కొద్ది దూరం పొడిగించి బందరు, ఏలూరు రోడ్లకు వేరుపడేలా మార్పు చేశారు.
కీలక మార్పులివే..
ఏలూరు రోడ్డుకు వెళ్లే మెట్రోరైలు మార్గాన్ని తుమ్మలపల్లి కళాక్షేత్రం వైపు నుంచి రైల్వేస్టేషన్ మీదుగా మళ్లింపు, రైల్వే పార్శిల్ కౌంటర్ వద్ద ఒకటి, రైల్వే స్టేషన్ వద్ద మరోటి మెట్రో స్టేషన్లను నిర్మించాలని తొలుత భావించారు. వీటి మధ్య కేవలం 400 మీటర్ల దూరం మాత్రమే ఉండటంతో ఒకచోట స్టేషన్ నిర్మిస్తే చాలని నిర్ణయించారు.
రైల్వేస్టేషన్ నుంచి గాంధీనగర్ అలంకార్ హోటల్ వరకు రోడ్డు ఇరుకుగా, ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నందున ఆ ప్రాంతంలో మెట్రో రైల్వే లైను రెండు ట్రాక్‌లు కాకుండా ఒకటి నిర్మించేలా డిజైన్ రూపొందించాలని నిశ్చయించారు.
లెనిన్ సెంటర్ మీదుగా ఏలూరు రోడ్డుకు వెళ్లే ప్రాంతంలో సౌత్ ఇండియన్ షాపింగ్‌మాల్ వద్ద ప్రైవేటు భవనం రెండు మీటర్ల మేర అడ్డు వస్తోందని, దాన్ని తప్పించి మెట్రో లైన్ ఎలైన్‌మెంట్ రూపొందించాలని శ్రీధరన్ భావించారు.
మాచవరం సెంటర్‌లో మెట్రో స్టేషన్‌కు సమీపంలోని భవనం అడ్డు వచ్చే అవకాశం ఉన్నందున దానికి ఇబ్బంది లేకుండా డిజైన్ రూపొందించాలని ఆదేశించారు.
గుణదల రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ), రామవరప్పాడు వద్ద ఇన్నర్ రింగ్‌రోడ్డు ఆర్వోబీ మెట్రో లైను తగిలే అవకాశం ఉన్నందున రైల్వే, ఆర్‌అండ్‌బీ అధికారులతో కలిసి డిజైన్‌లో మార్పులు చేసుకోవాలని నిర్ణయించారు.
పలు అంశాలపై సంతృప్తి
రామవరప్పాడు రింగురోడ్డు వద్ద మెట్రో స్టేషన్ నిర్మించేందుకు అవసరమైన స్థలం ఉందని శ్రీధరన్ సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం బెంజిసర్కిల్ నుంచి కానూరు వరకు ప్రయాణించిన శ్రీధరన్ బృందం అటువైపు మెట్రోలైను నిర్మాణానికి అవసరమైన జాగా ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు. బెంజిసర్కిల్‌లో ప్రతిపాదించిన ప్లైఓవర్ నిర్మాణం పూర్తయినా.. దాని పైనుంచి మెట్రోరైలు వెళ్లేలా డిజైన్ రూపొందిస్తున్నందున ఎటువంటి ఇబ్బంది ఉండదని శ్రీధరన్ తన వెంట ఉన్న బృందానికి చెప్పారు. ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 11.50 గంటల వరకు శ్రీధరన్ బృందం నగరంలో మెట్రో కారిడార్ నిర్మించే ప్రాంతంలో పర్యటించింది. ఢిల్లీ మెట్రోరైలు ప్రాజెక్టు ఎండీ ఎస్‌డీ శర్మ, విజయవాడ మెట్రోరైలు ప్రాజెక్టు డీపీఆర్ బాధ్యతలు చూస్తున్న అధికారి పాండురంగారావు కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు.