‘అది అవమానం కాదు.. ప్రధాని ముఖ్యం కదా..’
కొచ్చి: ప్రధాని నరేంద్రమోదీతో వేదికను పంచుకోనివ్వనందుకు తానేం బాధపడలేదని, పైగా అది అవమానంగా భావించడం లేదని ఇండియన్ మెట్రో మ్యాన్‌గా పేరొందిన ప్రముఖ రిటైర్డ్ ఇంజినీర్ కేరళకు చెందిన ఈ శ్రీధరన్ అన్నారు. శనివారం కేరళలో కొచ్చి మెట్రోను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రధాని వేదికపైకి శ్రీధరన్‌ను ఆహ్వానించలేదు. దీంతో ఆయనకు అవమానం జరిగిందని మీడియాలో విస్తృత చర్చ జరుగుతుండటంతో కొంతమంది మీడియా ప్రతినిధులు ఆయనను ఈ విషయంపై గురువారం ప్రశ్నించారు.
‘ఆ విషయాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో వివాదం చేయొద్దు. ప్రధాని భద్రతకు ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వాలి.. అది తప్పనిసరి కూడా. భద్రతా సంస్థలు ప్రధాని రక్షణకోసం ఏ నిర్ణయం తీసుకున్నా వాటిని తప్పనిసరిగా అనుసరించాలి. ఈ విషయంపై నాకు ఎలాంటి ఫిర్యాదులు లేవు’ అని ఆయన వివాదానికి తెరదింపారు. ఢిల్లీ మెట్రోకు కూడా శ్రీధరన్ కీలక సలహాదారుగా వ్యవహరించడంతోపాటు కొచ్చి మెట్రో విషయంలో కూడా తన జోక్యం ఉంది. ఇదిలా ఉండగా కొచ్చి మెట్రో అధికారులు కూడా దీనిపై వివరణ ఇస్తూ శ్రీధరన్ కూడా ప్రధాని వేదికపై ఉండేలా తాము జాబితా పంపించామని, కానీ, తుది జాబితా మాత్రం ప్రధాని మంత్రి కార్యాలయం సిద్ధం చేసి పంపించినందున తాము ఏం చేయలేపోయామని అన్నారు.