బాధిత రైతులకు.. అండగా..
గుంటూరు సిటీ: బాధిత రైతుల్లో మనో ధైర్యం నింపేందుకు మరోమారు రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నట్టు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ వెల్లడించారు. బుధవారం గుంటూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటు చేసిన రాజధాని రైతులు, కౌలు రైతులు, కూలీల హక్కుల పరిరక్షణ కమిటీ గురువారం పలు గ్రామాల్లో పర్యటించి రైతులకు అండగా నిలవనున్నట్టు ఆయన తెలిపారు.
ఉదయం పది గంటలకు ఉండవల్లి నుంచి ప్రారంభించి పెనుమాక, నిడమర్రు, ఉద్దండ్రాయునిపాలెం, లింగాయపాలెం గ్రామాల్లో పర్యటన జరగనున్నట్టు వివరించారు. ఈ సందర్భంగా రైతులకు తమ అండ ఉంటుందని తెలియజేయడంతోపాటు ప్రభుత్వానికి స్పష్టమైన హెచ్చరికలు కూడా జారీ చేస్తామన్నారు. అనంతరం జిల్లా ఎస్పీని కలసి వాస్తవ పరిస్థితులపై వినతిపత్రం సమర్పిస్తామన్నారు.
రాజధాని ప్రాంతంలోని అన్ని గ్రామాల్లో ఎమర్జెన్సీ వాతావరణం రాజ్యమేలుతోందని మర్రి రాజశేఖర్ ఆందోళన వ్యక్తం చేశారు. రాజధానికి భూములివ్వని వారిని భయభ్రాంతులకు గురిచేసే విధంగా అక్కడ పచ్చచొక్కాల దమనకాండ అమలవుతోందని ఆరోపించారు.
ప్రజాస్వామ్యంలో ప్రజల భూములను దౌర్జన్యంగా లాక్కునేందుకు ప్రయత్నించడమేమిటని ఆయన ప్రశ్నించారు. ఇవ్వనంటే అర్ధరాత్రి దాడి చేసి పోలీసులతో అక్రమంగా నిర్బంధిస్తారా? ఇదెక్కడి న్యాయం? అంటూ పాలకులను నిలదీశారు. దహనకాండ వ్యవహారంలో శ్రీనాథ్‌చౌదరి అనే వ్యక్తిపై అక్రమ కేసు మోపారన్నారు.
బాధ్యతాయుత ప్రతిపక్షంగా అక్రమాలను ప్రతిఘటిస్తూ రైతులకు అండగా నిలుస్తున్న వైఎస్సార్ సీపీ పైనే ఆరోపణలు చేస్తూ తమతోపాటు రైతుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అయితే వారి తాటాకు చప్పుళ్లకు బెరిరే వారు ఇక్కడ ఎవరూ లేరనే విషయాన్ని సీఎం చంద్రబాబు గుర్తుంచుకోవాలన్నారు. తాము ఇక్కడ రాజధాని నిర్మించవద్దని కానీ, ఎవరూ భూములు ఇవ్వవద్దని కానీ ఎన్నడూ వ్యాఖ్యానించలేదని ఆయన స్పష్టం చేశారు.