సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును సీబీఐ దర్యాప్తుకు అప్పగించాలని కోరుతూ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణకు సుప్రీంకోర్టు స్వీకరించింది. ఈ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణకు ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఓటుకు కోట్లు ప్రధాన కేసుకు ఈ తాజా పిల్‌ని జత చేయాలని ధర్మాసనం సోమవారం ఆదేశించింది. విచారణ తేదీలను సుప్రీంకోర్టు త్వరలో ఖరారు చేయనుంది. కాగా ఇప్పటికే ఓటుకు కోట్లు కేసుకు సంబంధించి ప్రధాన పిటిషన్ పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే.
ఓటుకు కోట్లు వ్యవహారం జరిగి రెండున్నర సంవత్సరాలు అయినా.. తదుపరి పరిణామాల నేపథ్యంలో విచారణలో జాప్యం చోటుచేసుకుందని, తెలంగాణ ఏసీబీ దర్యాప్తు నిష్పక్షపాతంగా చేయడం లేదని మొదటి ఛార్జిషీట్‌కు రెండో చార్జిషీట్‌కు వ్యత్యాసం ఉందని ఎమ్మెల్యే ఆర్కే తన పిటిషన్‌లో పేర్కొన్నారు. న్యాయస్థానం తాజా ఆదేశాలపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఓటుకు కోట్లు కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయారని, అయితే ఈ కేసు విచారణ ముందుకు జరగకుండా ఆయన విశ్వప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఆడియో టేపుల్లో మాట్లాడింది చంద్రబాబేనని రుజువైందని, ఆయన పాత్ర బయటపడాలంటే సీబీఐ విచారణ జరగాలన్నారు.
మరోవైపు ఎమ్మెల్యే ఆర్కే న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ ఏసీబీ దర్యాప్తు సరిగా చేయడం లేదన్నారు. కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని, నిష్పక్షపాత దర్యాప్తు కోసం సీబీఐ విచారణ జరగాలని ఎమ్మెల్యే ఆర్కే పిటిషన్ వేసినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment