సాక్షి లీగల్ కరస్పాండెంట్, న్యూఢిల్లీ: వాన్‌పిక్‌కు భూముల కేటాయింపు కేసులో రాష్ట్ర మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు సుప్రీంకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. అవినీతి ఆరోపణల కేసులో ప్రభుత్వ అనుమతి లేకున్నా ధర్మానపై సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టడాన్ని హైకోర్టు నిలిపేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్పీ) దాఖలు చేసింది. దీనిపై ధర్మాసనం విచారణ చేపట్టింది. ధర్మాన ప్రసాదరావు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 19 కింద ఆయనను విచారించడానికి ఎలాంటి అనుమతి అవసరం లేదని అభయ్ సింగ్ చౌతాలా కేసును సీబీఐ ఉటంకించింది. తదుపరి విచారణ కొనసాగించడానికి వీలుగా హైకోర్టు ఆదేశాలను రద్దు చేయాలని ధర్మాసనానికి విన్నవించింది. సీబీఐ ఎస్‌ఎల్పీపై తన స్పందనను నాలుగు వారాల్లోగా తెలియజేయాలని ఆదేశిస్తూ ధర్మానకు సుప్రీం నోటీసులు జారీ చేసింది.
ధర్మానకు సుప్రీంకోర్టు నోటీసులు
Published Tue, Aug 27 2013 6:03 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement