* నేడు సుప్రీంకోర్టు ముందుకు ఎంసెట్ వివాదం
* గట్టి వాదనలకు సిద్ధమైన తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు
* కోర్టు దృష్టికి కాలేజీల తనిఖీలు, అనుమతుల ప్రక్రియ
* అవి పూర్తికాకుండా ప్రవేశాలు కష్టమని వివరించనున్న టీ సర్కారు
* కొత్త రాష్ర్టంలో అధికారుల కొరతతోనూ కౌన్సెలింగ్‌లో జాప్యం
* మరింత గడువు కోసం పట్టుబట్టనున్న తెలంగాణ ప్రభుత్వం
* విభజన చట్టం మేరకు ఉమ్మడి ప్రవేశాలు జరగాలని వాదించనున్న ఏపీ
* కౌన్సెలింగ్‌కు సిద్ధమేనని తెలపనున్న ఏపీ ఉన్నత విద్యా మండలి
సాక్షి, హైదరాబాద్: ఇరు రాష్ట్రాల మధ్య చిచ్చు రేపుతున్న ఎంసెట్ కౌన్సెలింగ్ వ్యవహారం సుప్రీంకోర్టులో సోమవారం విచారణకు రానుంది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన ఈ విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్న తరుణంలో సుప్రీం నిర్ణయమే కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో తన వాదన బలంగా వినిపించేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమైంది.
ఇంజనీరింగ్ కాలేజీల తనిఖీలు పూర్తి చేసి, అఫిలియేషన్లు (అనుమతులు) ఇవ్వకుండా ప్రవేశాలు చేపట్టడం కష్టమేనని కోర్టుకు స్పష్టం చేయనుంది. ఎంసెట్ కౌన్సెలింగ్‌ను అక్టోబర్ 31లోగా పూర్తి చేస్తామని, అప్పటివరకు గడువు ఇవ్వాలని కోరుతూ గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సాయం కోసం చేపట్టిన ‘ఫాస్ట్’ పథకం అమలుకు మరింత సమయం కావాలని భావిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ మేరకు కోర్టు అనుమతి పొందేందుకు పకడ్బందీగా వాదనలు వినిపించాలని అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించిన అంశాలపై విద్యా శాఖ, న్యాయ శాఖ వర్గాలు ఇప్పటికే పలుమార్లు కేసీఆర్‌తో పాటు విద్యా శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో చర్చలు జరిపారు.
తాము వినిపించబోయే వాదనలను ఆదివారం కూడా ముఖ్యమంత్రి దృష్టికి సంబంధిత వర్గాలు తీసుకెళ్లినట్లు తెలిసింది. ఇంజనీరింగ్ ప్రవేశాలకు సంబంధించి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఏపీ ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ జారీ చేయడాన్ని తెలంగాణ సర్కారు తీవ్రంగా తప్పుబట్టిన సంగతి తెలిసిందే. కోర్టు పరిధిలో ఉన్న అంశంలో నిర్ణయం తీసుకోవద్దని కోరినా పట్టించుకోకపోవడం, తెలంగాణ అధికారులు హాజరుకాకున్నా నిర్ణయం తీసుకోవడం వంటి విషయాలను కోర్టు దృష్టికి తీసుకువచ్చే అవకాశముంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఒత్తిడి మేరకే కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టినట్లు తెలంగాణ సర్కారు కోర్టుకు తెలపనుంది. కాగా, ఆదివారం రాత్రికే విద్యా శాఖ, న్యాయ శాఖ అధికారులు ఢిల్లీ చేరుకున్నారు. వీరు తెలంగాణ పక్షాన ప్రధానంగా మూడు అంశాలపై సుప్రీంకోర్టులో వాదనలు వినిపించనున్నట్లు సమాచారం.
* తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించే ఫాస్ట్ పథకం గురించి వివరిస్తారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల ఫీజులను ప్రభుత్వమే చెల్లించే ఈ పథకానికి మార్గదర్శకాలు జారీ చేయాల్సి ఉందని, ఇందుకు కొంత సమయం పట్టనుందని తెలియజేస్తారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ర్టంలో ఐఏఎస్ అధికారుల కొరత ఉందన్న విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తేనున్నారు. దీంతో ఫాస్ట్ మార్గదర్శకాల రూపకల్పనలో కొంత ఆలస్యమవుతోందని, అయినా అందుబాటులో ఉన్న అధికారులతో కమిటీని కూడా ఏర్పాటు చేశామని వివరించనున్నారు. అయితే అధికారులకు పనిభారం వల్ల మార్గదర్శకాల జారీకి మరికొంత సమయం పడుతుందని, ప్రధానంగా ‘స్థానికత’ నిర్ధారణ అంశంపై కసరత్తు జరుగుతన్నట్లు కోర్టుకు తెలియజేసే అవకాశం ఉంది. ఆ తర్వాత విద్యార్థులకు సర్టిఫికెట్ల జారీకి సమయం పడుతుందని తెలపనున్నారు.
* కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా మొదట చేపట్టే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో విద్యార్థుల ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు కీలకమని, అవి లేకుండా వెరిఫికేషన్ కుదరదని వివరించనున్నారు. ఇందుకోసమే రెవెన్యూ శాఖను సిద్ధం చేస్తున్నామని, మార్గదర్శకాలు జారీ చేశాక, వేగంగా సర్టిఫికెట్ల జారీకి సన్నాహాలు చేయాలని ఇప్పటికే ఆదేశించినట్లు తెలియజేయనున్నారు. కౌన్సెలింగ్‌కు వీలుగా తెలంగాణ ఉన్నత విద్యా మండలిని ఏర్పాటు చేసుకున్న విషయాన్ని కూడా ప్రస్తావించనున్నారు.
* దాదాపు 446 వృత్తి విద్యా కాలేజీల తనిఖీలు(వీటిలో 330కి పైగా ఇంజనీరింగ్ కాలేజీలు) కొనసాగుతున్నాయని, అవి పూర్తి చేసేందుకు మరో మూడు వారాల సమయం పడుతుందనే విషయాన్ని కోర్టుకు చెప్పనున్నారు. తనిఖీలు పూర్తయ్యాకే కాలేజీలకు అనుమతులు(అఫిలియేషన్లు) ఇస్తామని జేఎన్‌టీయూ పేర్కొన్న విషయాన్ని కూడా ప్రస్తావించనున్నారు. ఏయే కాలేజీల్లో ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయనే విషయాలను కౌన్సెలింగ్ సమయంలో విద్యార్థులకు తెలియజేయాల్సి ఉంటుందని, అప్పుడే వారు ఆప్షన్లు ఇచ్చుకునే వీలు ఏర్పడుతుందని వివరించనున్నారు. ఇవన్నీ పూర్తి చేసేందుకు గడువు కావాలని విజ్ఞప్తి చేయనున్నారు.
వాదనలకు ఏపీ సర్కారూ సిద్ధం
ఈ అంశంపై బలమైన వాదనలు వినిపించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సిద్ధమైంది. ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలను విభజన చట్టంలో పేర్కొన్న మేరకే నిర్వహించాలని ఏపీ ఉన్నత విద్యామండలి, ఆ రాష్ర్ట ప్రభుత్వం వాదించే అవకాశముంది. విభజన చట్టంలోని సెక్షన్ 95 ప్రకారం ఉన్నత విద్యా సంస్థల్లో ఉమ్మడి ప్రవేశాలు నిర్వహించాలని, అందుకు అనుగుణంగా ఉన్నత విద్యామండలికి అధికారాలు కల్పించిన విషయాన్ని కోర్టు దృష్టికి తేనున్నాయి.
ఉమ్మడి ప్రవేశాలకు తెలంగాణ ప్రభుత్వం సహకరించని పక్షంలో కేంద్రం జోక్యం చేసుకుని ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేయవచ్చని వివరించనున్నాయి. ఇరు రాష్ట్రాలకు ఏకాభిప్రాయం కుదరని అంశాలను కేంద్రమే పరిష్కరించాలని విభజన చట్టంలోని సెక్షన్ 75లో స్పష్టంగా పేర్కొన్నట్లు కోర్టు దృష్టికి తేనున్నట్లు సమాచారం. కౌన్సిలింగ్ నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని, ఇప్పటికే నోటిఫికేషన్ కూడా జారీ చేశామని ఏపీ ఉన్నత విద్యా మండలి తన వాదన వినిపించనుంది. తాము రెండు రాష్ట్రాలకు లేఖలు రాశామని, వారిని సంప్రదించి, లోతుగా అలోచించాకే నిర్ణయం తీసుకున్నామని సుప్రీంకు చెప్పబోతోంది. తీవ్ర జాప్యంపై విద్యార్థుల్లో ఆందోళన నె లకొందన్న విషయాన్ని పేర్కొంటూ.. కోర్టు తీర్పు ఆధారంగానే నడుచుకుంటామని తెలియజేయనుంది.
కాగా, ఇంజనీరింగ్ కోర్సుల్లో 180 రోజుల పనిదినాలు తప్పనిసరిగా ఉండాలని, దేశవ్యాప్తంగా ఒకే క్యాలెండర్‌ను అమలు పరచాల్సి ఉన్నందున తక్షణమే కౌన్సిలింగ్ నిర్వహించాలని ఏఐసీటీఈ కూడా కోర్టుకు వివరించే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశాలను రెండు నెలలు ఆలస్యం చేయడం వల్ల ఒక సెమిస్టర్ పరీక్షలకు ఇబ్బంది వస్తుందని ఏఐసీటీఈ వాదించవ చ్చని చెబుతున్నారు. తమదీ అదే వాదన కనుక అనుకూలంగానే తీర్పు రావచ్చునని ఆ రాష్ర్ట వర్గాలు ఆశిస్తున్నాయి.
ఎం‘సెట్’ అయ్యేనా?
Published Mon, Aug 4 2014 12:37 AM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM
Advertisement