ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు ఎలాగైనా గడువు పొందాల్సిందే
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ తదితర వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలను అక్టోబరు 31వ తేదీలోగా పూర్తి చేస్తామని, అప్పటివరకు గడువు కావాలని సుప్రీంకోర్టులో వేసిన కేసు ఈ నెల 4న విచారణకు రానుంది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఎందుకు గడువు కోరుతుందో పకడ్బందీగా, స్పష్టంగా కోర్టుకు వివరించాలని న్యాయశాఖ, విద్యాశాఖను సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు తెలిసింది. శుక్రవారం సీఎం అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, విద్యాశాఖ, న్యాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.
కొత్త రాష్ట్రాలు ఏర్పడినపుడు ఎలాంటి సమస్యలు వస్తాయో సవివరంగా తెలియజేయాలని, రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను సుప్రీంకోర్టుకు వివరించాలని సీఎం పేర్కొన్నట్లు తెలిసింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సహాయం (ఫాస్ట్) పథకం, అందుకవసరమైన మార్గదర్శకాల రూపకల్పనకు కావాల్సిన యంత్రాంగం, స్థానికతను నిర్ధరించడంలో రాష్ట్ర స్థాయి అధికారుల అవసరాలు, ప్రస్తుత పరిస్థితులను వివరించాలని సూచించినట్లు సమాచారం. అలాంటి యంత్రాంగం లేని పరిస్థితుల్లో సకాలంలో చేయలేకపోతున్నామని, అందుకే గడువును కోరుతున్నామనే అంశాన్ని స్పష్టంగా వినిపించాలని ఆదేశించినట్లు తెలి సింది. ఫాస్ట్‌లో స్థానికత ఆధారాలు, ఆర్థిక పరిస్థితులను తెలుసుకునేందుకు రూపకల్పనకు పట్టనున్న సమయం, ఆ తరువాత విద్యార్థుల ఆ సర్టిఫికెట్లు పొందేందుకు పట్టే సమయం తదితర వివరాలన్నింటితో వాదన చేయాలని, వాటితో కోర్టు ఏకీభవించేలా ఉండాలని చెప్పినట్లు సమాచారం. కాలేజీలను తనిఖీ చేసి అనుమతులు ఇవ్వాల్సి ఉందని, దానికీ సమయం పడుతుందనే విషయాన్ని కోర్టు దృష్టికి తేవాలని సీఎం చెప్పారు. ఏపీ ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి, అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఏ వాదన చేసినా వాటికి సమర్థంగా జవాబు ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిసింది.
సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు సహకరించం: తెలంగాణ జీసీజీటీఏ
ఏపీ ఉన్నతవిద్యామండలి నిర్వహించనున్న ఎంసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ప్రభుత్వ డిగ్రీ లెక్చరర్లు సహకరించకూడదని తెలంగాణ జీసీజీటీఏ నిర్ణయించింది. తెలంగాణలోని డిగ్రీ కాలేజీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో పాల్గొన వద్దని తమ సభ్యులను కోరింది. ప్రభుత్వ నిర్ణయాల అమలుకు లెక్చరర్లు సహకరించాలని సంఘం అసోసియేట్ అధ్యక్షుడు హరినాథ్‌శర్మ కోరారు.
టీ విద్యార్థులు హాజరు కావొద్దు: శ్రీనివాస్‌గౌడ్
ఎంసెట్ కౌన్సెలింగ్‌కు తెలంగాణ విద్యార్థులు హాజరుకావొద్దని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో)నేత, ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. శుక్రవారం సచివాలయంలోని ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎంసెట్ కౌన్సెలింగ్‌లో పాల్గొంటే తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్నారు. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న వాదన సరైనది కాదని అన్నారు.
పకడ్బందీగా వాదనలు వినిపించండి
Published Sat, Aug 2 2014 1:14 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement
Advertisement