జామి పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి
సాక్షి ప్రతినిధి, విజయనగరం: వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా నెగ్గడమే లక్ష్యంగా ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల ఓట్లను అధికార టీడీపీ అడ్డగోలుగా తొలగిస్తోంది. ఇందుకోసం అధికార బలాన్ని ప్రయోగిస్తోంది. టీడీపీ కుతంత్రాన్ని అడ్డుకున్న విజయనగరం జిల్లా వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు అరెస్టు చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అలాగే రాష్ట్రంలో పలు జిల్లాల్లో యువకులు దొంగ సర్వే చేస్తుండగా వైఎస్సార్‌సీపీ నాయకులు అడ్డుకున్నారు. వారిని పోలీసులకు అప్పగించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం రోజే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం.
అసలేం జరిగింది?
విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కుమిలి గ్రామంలో గురువారం ఓటర్ల జాబితాలను చేతపట్టుకుని, ఇంటింటికీ తిరుగుతూ సర్వే చేస్తున్న ముగ్గురు వ్యక్తులను వైఎస్సార్‌సీపీ నాయకులు పట్టుకుని పోలీసులకు అప్పగిం చారు. వారిని పోలీసులు విచారించకుండా వదిలిపెట్టారు. దీనిపై పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా స్పందించారు. డీజీపీ, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధపడ్డారు. ఈ క్రమంలో సర్వే చేస్తూ పట్టుబడ్డ వ్యక్తుల నుంచి ట్యాబ్‌లను లాక్కున్నారంటూ ప్రైవేటు సంస్థ ఫిర్యాదు చేసిందని, ఆ ట్యాబ్‌లను తిరిగి ఇచ్చేయాలంటూ పోలీసులు అర్ధరాత్రి వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్లకు వెళ్లారు. పూసపాటిరేగ మండల పార్టీ అధ్యక్షుడు పతివాడ అప్పలనాయుడు, నాయకులు పతివాడ అశ్వినీకుమార్, వెన్నె మహేష్, పతివాడ సన్యాసి నాయుడు, బుర్లే శ్రీనులను రెళ్లివలస గ్రామంలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత వారి స్వగృహాల్లో అరెస్ట్ చేసి, చీపురుపల్లి నియోజకవర్గం గుర్ల పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు.
ఆ సమయంలో నేతలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. కుమిలి ఎంపీటీసీ సభ్యురాలు గాబు భాగ్యలక్ష్మిని బయటకు రావా లని, ట్యాబ్ ఇవ్వాలని అరుచుకుంటూ ఇంటి నుండి 100 అడుగుల దూరం తీసుకెళ్లారు. ఆమె ఎదురు తిరగడంతో వదిలేశారు. మహిళనని కూడా చూడకుండా కేవలం వైఎస్సార్‌సీపీ సానుభూతిపరురాలిననే కక్షతోనే పోలీసులు దౌర్జన్యం చేశారని కుమిలి మాజీ సర్పంచ్ గుజ్జు కృష్ణవేణి ఆవేదన వ్యక్తం చేశారు. కుమిలి గ్రామానికి చెందిన 8 మంది వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి, నెల్లిమర్ల స్టేషన్‌కు తరలించి కేసులు నమోదు చేశారు.
సంబంధం లేని మజ్జి శ్రీనివాస్ అరెస్టు
వైఎస్సార్‌సీపీ విజయనగరం జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ఇంటివద్దకు శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు భారీగా చేరుకున్నారు. ట్యాబ్‌లు ఇవ్వకపోతే అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. తనవద్ద ట్యాబ్‌లు లేవని ఆయన చెబుతున్నా వినకుండా అరెస్ట్ చేసి, ఊరంతా తిప్పి చివరికి ఎస్.కోట నియోజకవర్గం జామి పోలీస్ స్టేషనుకు తరలించి నిర్బంధంలో ఉంచారు. పార్టీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామితోపాటు ముఖ్యనాయకులు స్టేషన్‌కు శుక్రవారం ఉదయానికే చేరుకుని శ్రీనివాసరావును విడుదల చేయాలని డీఎస్పీని కోరారు. వాంగ్మూలం తీసుకుని విడిచిపెడతామన్న డీఎస్పీ మధ్యాహ్నం 2 గంటల వరకూ ఆ పని చేయలేదు. అనంతరం డీఐజీ జి.పాలరాజు ఆదేశాల మేరకు వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు నోటీసు ఇచ్చి విడుదల చేశారు.
అరెస్టులపై వైఎస్సార్‌సీపీ ఆందోళన
సర్వేల పేరిట గ్రామాల్లో తిరుగుతున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ నాయకులను అరెస్టు చేయడం పట్ల పార్టీ కార్యకర్తలు ఆగ్రహంతో రగిలిపోయారు. ఓట్ల తొలగింపుపై తమ పార్టీ నాయకులు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా ప్రైవేటు వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అరెస్టులు చేయడం ఏమిటని మండిపడ్డారు. మజ్జి శ్రీనివాసరావును నిర్బంధంలో ఉంచిన జామి పోలీస్ స్టేషన్ వద్ద వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పూసపాటిరేగ మండలంలోని రెల్లివలస, కుమిలి గ్రామాలకు చెందిన నాయకులను అరెస్టు చేసి, నిర్బంధించిన గుర్ల, నెల్లిమర్ల పోలీస్‌స్టేషన్‌ల వద్ద ఆందోళన చేశారు. రాస్తారోకో చేశారు.
జిల్లావ్యాప్తంగా 700 మందితో సర్వే
పీపుల్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనే ప్రైవేటు సంస్థ విజయనగరం జిల్లాలో దాదాపు 700 మంది యువకులను నియమించుకుని సర్వే చేపడుతోంది. యువకులకు రోజుకు రూ.800 చొప్పున చెల్లిస్తూ వారి చేతికి ట్యాబ్‌లు ఇచ్చి గ్రామాల్లోకి పంపుతోంది. వీరిలో ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం, తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్(టిఎన్‌ఎస్‌ఎఫ్)కు చెందిన వారే ఉండడం గమనార్హం. వీరు తమకు ఇచ్చిన ట్యాబ్‌లలో ఉన్న ఓటర్ల జాబితా ఆధారంగా కొన్ని ఇళ్లకు వెళ్లి మాట్లాడుతున్నారు. ప్రభుత్వ పనితీరుపై ఓటర్ల అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అభిప్రాయం వ్యక్తం చేసిన వారి ఓట్లను తొలగిస్తున్నారని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. శుక్రవారం బొబ్బిలి, సాలూరు, చీపురుపల్లి, పార్వతీపురం మండలాల్లో సర్వేలు చేసేందుకు వచ్చిన యువకులను స్థానిక నాయకులు పట్టుకుని పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు.
సర్వే తప్పు కాదు: డీఐజీ
ఓటర్ల జాబితాలను ట్యాబ్‌లో పొందుపరుచుకుని సర్వే నిర్వహించడం నేరం కాదని విశాఖ రేంజ్ డీఐజీ జి.పాలరాజు తెలిపారు. జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సర్వేపై అభ్యంతరాలుంటే ఫిర్యాదు చేయాలే తప్ప ట్యాబ్‌లు లాక్కొని దౌర్జన్యం చేయడం చట్టరీత్యా నేరమని, ఆ కేసులోనే వైఎస్సార్‌సీపీ నేతలను అరెస్ట్ చేశామని వివరించారు.
రాష్ట్ర చరిత్రలో చీకటి రోజు
వైఎస్సార్‌సీపీ ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉంది. అన్యాయంగా ఓట్లు తొలగిస్తున్నారని ఫిర్యాదు చేసిన వారిని అరెస్టు చేయడం దారుణం. రాష్ట్ర చరిత్రలో ఇదొక చీకటి రోజు. అమరావతి నుంచి ఆదేశాలిచ్చి అక్రమ అరెస్టులకు దిగుతున్నారు. ఎన్నికల సంఘం మాకు తప్పకుండా న్యాయం చేస్తుందని నమ్ముతున్నాం.
– మజ్జి శ్రీనివాసరావు, విజయనగరం జిల్లా వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త
ఓట్ల తొలగింపు ముమ్మాటికీ నిజమే
వైఎస్సార్‌సీపీ నేతలను అరెస్టులు చేసిన తీరును చూస్తే ఓట్ల తొలగింపు అన్నది అనుమానం కాదు ముమ్మాటికీ నిజమేనని తేటతెల్లం అవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. సర్వేల పేరుతో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు, నాయకుల ఇళ్లకు వచ్చి ఓట్ల తొలగింపుకు సిద్ధపడ్డారు. దొంగ సర్వేలు చేస్తున్న వారిని వదిలేసి, వైఎస్సార్‌సీపీ నాయకుల ఇళ్లల్లోకి చొరబడి అర్ధరాత్రి అరెస్టులకు తెగబడటం సిగ్గుచేటు
– కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల కన్వీనర్
Comments
Please login to add a commentAdd a comment