నెల్లూరు (క్రైమ్), : భార్య కాపురానికి రాలేదని మనస్తాపం చెందిన ఓ భర్త తన ఇంట్లోని దూలానికి చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రంగనాయకులపేటలోని పొర్లుకట్ట ఉప్పరపాళెంలో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసుల కథనం మేరకు...పొర్లుకట్టకు చెందిన అరవ శ్రీను అలియాస్ శివ (38)కు చింతారెడ్డిపాళెంకు చెందిన ఝా న్సీతో ఏడేళ్ల కిందట వివాహమైంది. శ్రీను సోమిశెట్టి కల్యాణ మంటపం సమీపంలోని టీ దుకాణంలో మాస్టర్‌గా పనిచేస్తున్నాడు.
వీరికి ఇద్దరు పిల్లలు. మద్యానికి బానిసైన శ్రీను తరచూ భార్యతో ఘర్షణ పడేవాడు. దీంతో పలు దఫాలు భర్త ప్రవర్తనపై జాన్సీ మూడో నగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారం కిందట దంపతుల నడుమ ఘర్షణ జరిగింది. ఇక్కడుంటే మారవని, తనతో పాటు చింతారెడ్డిపాళెంకు రావాలని ఝాన్సీ భర్తను కోరింది. అతను నిరాకరించడంతో ఆదివారం ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.
అప్పటి నుంచి అతను పనికి వెళ్లడం లేదు. ఫూటుగా మద్యం సేవిస్తూ తిండి తినడం మానేశాడు. తల్లి, సోదరి విజ్ఞప్తి మేరకు అతను మంగళవారం చింతారెడ్డిపాళెంకు వెళ్లి భార్యను రమ్మని పిలిచాడు. ఆమె నిరాకరించడంతో మనస్తాపం చెందిన శ్రీను మధ్యాహ్నం ఇంటికి వచ్చి ఎవరికి కనిపించలేదు.
బుధవారం ఉదయం టీ దుకాణంలో పనిచేస్తున్న ఓ వ్యక్తి వచ్చి శ్రీను ఇంటికి వెళ్లి తలుపులు తట్టి పిలిచినా ఎలాంటి అలికిడి లేదు. అతను శ్రీను తల్లిని అడిగాడు. ఆమె తనకు తెలియదని చెప్పి ఇంటికి వెనక వైపునున్న కిటికీలో నుంచి చూడగా ఇంటి రేకులకు వేసిన దూలానికి శవమై కనిపించాడు. మూడో నగర ఎస్‌ఐ నాగభూషణం శ్రీను తల్లి, సోదరి సమక్షంలో తలుపులు పగలగొట్టించి మృతదేహాన్ని కిందకు దించి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.