అనంతపురం : ఎట్టకేలకు అవినీతి అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న పీటీసీ డీఎస్పీ ఏ. హనుమంతుపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు డీజీపీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ బిల్డింగ్ నిర్మాణంలో కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు దండుకోవడం, ఉద్యోగులను వేధింపులు, అక్రమంగా హెచ్‌ఆర్‌ఏ నిధులు డ్రా చేయడం, ప్రభుత్వ వాహనాన్ని అనధికారికంగా ప్రైవేటుకు వినియోగించుకున్నట్లు తేలడంతో సస్పెన్షన్ వేటు పడింది. వివరాల్లోకి వెళ్తే...పీటీసీలో జరుగుతున్న నిర్మాణ పనుల్లో కమీషన్ ఇవ్వలేదనే కారణంతో డీఎస్పీ హనుమంతు నిర్మాణ పనులు ఆపించారని కాంట్రాక్టర్ షౌకత్ అలీఖాన్ గతంలో ఆరోపించారు.
ఇదే విషయమై చివరకు టూటౌన్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. పీటీసీలో క్వాటర్స్‌ను సబ్ కాంట్రాక్ట్ తీసుకున్న తనను డీఎస్పీ హనుమంతు ఇబ్బందులకు గురి చేశాడని, చివరకు రూ. 25 వేలు కమీషన్ రూపంలో ఇచ్చానని తెలిపాడు. రోజూ పని వద్దకు వచ్చి మిగిలిన కమీషన్ ఇస్తేనే పని చేయాలని, లేదంటే పనులు చేయొద్దని ఒత్తిడి చేస్తుండడంతో కొద్దిరోజు పనులు కూడా ఆపేశామని అప్పట్లో ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీనికి తోడు పీటీసీలో బిగ్లర్ హెడ్‌కానిస్టేబుల్‌గా పని చేస్తున్న ఎస్. ఇరుదయరాజ్ వెల్ఫేర్ స్టోరు హెల్పర్‌గా ఉంటున్నారు. డీఎస్పీ హనుమంతు వేధింపులు తాళలేక ఈయన కూడా గతంలో టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ‘స్టోర్‌లో నీవెంత సంపాదించావు? నాకు రూ. లక్ష ఇవ్వాలి’ అని డిమాండ్ చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. స్టోర్ ద్వారా ఎలాంటి అక్రమ సంపాదన చేయలేదని తెలిపితే ‘ నీ ఇష్టం. ఇవ్వకపోతే నీపై కేసు రాసి జైలుకు పంపుతా’నని బెదిరించాడని.. దీంతో భయపడి రూ. 45 వేలు డీఎస్పీకి ఇచ్చానని బాధితుడు ఆరోపించాడు. అంతటితో ఆగకుండా తక్కిన రూ. 55 వేలు కూడా ఇవ్వాలటూ గడువు విధించాడు. ఈ క్రమంలో తనను ఇబ్బందులకు గురి చేసిన డీఎస్పీపై చర్యలు తీసుకోవాలని ఇరుదయరాజ్ ఫిర్యాదు చేయడం అప్పట్లో కలకలం రేపింది.
వీటన్నింటికీ తోడు హనుమంతు ప్రభుత్వ క్వాటర్సులోనే ఉంటూ హెచ్‌ఆర్‌ఏ డ్రా చేయడం, తన వ్యక్తిగత పనులకు ప్రభుత్వ వాహనం ఉపయోగించడం తదితర ఫిర్యాదులపై ఉన్నతాధికారులు సమగ్రంగా విచారణ చేయించారు. డీఎస్పీ హనుమంతు లీలలు నిగ్గు తేలడంతో చివరకు సస్పెన్షన్ వేటు వేశారు. కాగా...తనను డీఎస్పీ హనుమంతు డబ్బులు డిమాండ్ చేస్తున్నాడంటూ ఫిర్యాదు చేసిన హెడ్‌కానిస్టేబుల్ ఇరుదయరాజ్‌ను ఇదివరకే సస్పెన్షన్ చేయడం కొసమెరుపు.
వేటు పడింది!
Published Wed, Feb 25 2015 2:38 AM | Last Updated on Fri, Jun 1 2018 8:52 PM
Advertisement
Advertisement