ఉచిత విద్యుత్‌కు మంగళం | Electricity supply suspension | Sakshi
Sakshi News home page

ఉచిత విద్యుత్‌కు మంగళం

Published Tue, Sep 20 2016 1:01 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

ఉచిత విద్యుత్‌కు మంగళం - Sakshi

ఉచిత విద్యుత్‌కు మంగళం

అనంతపురం అర్బన్‌ : ఈ ఫొటోలో ఉన్న వీరంతా బత్తలపల్లి మండలం పోట్లమర్రి ఎస్సీ కాలనీకి చెందిన వారు. రోజువారీ కూలీ చేసుకుని బతుకులీడ్చే పేదలు. కేవలం రెండు గదులున్న ఇందిరమ్మ ఇళ్లు వీరి నివాసాలు. కొద్ది రోజుల వరకు వీరంతా ఉచిత విద్యుత్  సౌకర్యం పొందారు. ఇటీవల వీరి ఇళ్లకు విద్యుత్‌ మీటర్లు బిగించారు. ఆ తరువాత డబ్బులు కట్టాలంటూ ఇచ్చిన విద్యుత్‌ బిల్లులు చూసి కంగుతిన్నారు. రామలక్ష్మి ఇంటికి రూ.3 వేలు, ఆదెమ్మ ఇంటికి రూ.3,700, రత్నమ్మ ఇంటికి రూ.2,780, లక్ష్మమ్మ ఇంటికి రూ.2 వేలు, రమణమ్మ ఇంటికి రూ.2 వేలు, ఇలా వారి ఎస్సీ కాలనీలోని ఇళ్లకు రూ.1,200 నుంచి రూ.4 వేల వరకు బిల్లులు వచ్చాయి.  దీంతో వారంతా లబోదిబో మంటూ తమ గోడును కలెక్టర్‌కి చెప్పుకునేందుకు సోమవారం కలెక్టరేట్‌కి వచ్చారు. కాలనీ పెద్దలు పెద్దన్న, నాగమూణి మాట్లాడుతూ వేల రూపాయలు బిల్లు వేస్తే ఎలాగని ఆవేదన వ్యక్తం చేశారు.మా కష్టాన్ని కలెక్టర్‌కి చెప్పుకుందామని వస్తే ‘మీ కోసం’ లేదంటున్నారంటూ, అర్జీని మీ కోసం కౌంటర్‌లో ఇచ్చి వెళుతున్నామన్నారు.


ప్రభుత్వం పేద దళిత వర్గాలను ఇబ్బందులకు గురిచేసే విధంగా ముందుకు పోతోంది. అందులో భాగంగా ఎస్సీ కాలనీలకు ఉచిత విద్యుత్ కి మంగళం పాడింది. ఇళ్లకు మీటర్లు బిగించి విద్యుత్‌ చార్జీల కింద వేలాది రూపాయలు బిల్లు మోత మోగిస్తోంది. ఇందిరమ్మ ఇళ్లలో నివాసముంటున్న దళితులు విలాసవంతమైన సౌకర్యాలు అనుభవించడం లేదు. వారి ఇళ్లలో ఒక టీవీ, ఒక ఫ్యాను, రెండు బల్బులు ఉంటాయి. నెల మొత్తం విద్యుత్‌ వినియోగించినా రూ.100 నుంచి రూ.150 మించి బిల్లు రాదు. అలాంటి రూ.వేలల్లో బిల్లు  రావడమే కాకుండా చెల్లించాలని ఒత్తిడి చేయడంపై దళితలు మండిపడ్డుతున్నారు. బత్తలపల్లి మండలం పొట్టుమర్రి గ్రామంలోనే కాదు ఇలాంటి పరిస్థితి జిల్లాలో పలు ఎస్సీ కాలనీల్లోనూ నెలకొంది. కొద్ది రోజుల క్రితం పలు ప్రాంతాల్లోని ఎస్సీ కాలనీలోనూ ఇలాగే వేల రూపాయలు విద్యుత్‌ బిల్లు జారీ చేసింది. అంతే కాకుండా ఏకంగా విద్యుత్‌ సరఫరాను నిలిపివేసి ఇబ్బందికి గురిచేసింది. ప్రభుత్వ వైఖరి చూస్తే దళిత వ్యతిరేక విధానాలు అనుసరిస్తోందనే విషయం స్పష్టమవుతోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement